Bengaluru Bandh: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య మరోసారి కావేరీ జల వివాదం చెలరేగింది. నీరు విడుదల చేయాలని ఒక రాష్ట్రం రైతులు, చేయవద్దని మరో రాష్ట్రం రైతులు ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. తమిళనాడుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న కావేరీ బోర్డు ఆదేశాలతో.. కన్నడిగులు ఆందోళనలకు దిగారు. తాగుకు, సాగుకు నీళ్లు లేని కరవు పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రానికి నీటిని విడుదల చేయవద్దంటూ రైతులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చాయి. మరో 15 రోజుల పాటు 5000 క్యూసెక్కుల చొప్పున నీటిని తమిళనాడుకు విడుదల చేయాలంటూ కావేరీ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయవద్దంటూ ఆందోళన చేస్తున్నారు.


సెప్టెంబర్ 13వ తేదీ నుంచి 15 రోజుల పాటు తమిళనాడుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై కర్ణాటక సర్కారు సుప్రీం కోర్టుకు వెళ్లగా.. సుప్రీం కోర్టు కర్ణాటక పిటిషన్ ను తిరస్కరించడంతో ఆందోళనలు మిన్నంటాయి. కర్ణాటక, తమిళనాడు సీఎంలకు అంతిమ సంస్కారం చేస్తూ రైతులు నిరసన చేస్తున్నారు.


బెంగళూరు బంద్ నేపథ్యంలో పోలీసులు సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు సీఆర్పీసీ సెక్షన్ 144 విధించారు. అలాగే నగరంలో ఈ రోజు ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతలు లేవని తేల్చి చెప్పారు. బెంగళూరు సిటీలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో సుమారు వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. బెంగళూరు బంద్ నేపథ్యంలో మంగళవారం అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేఏ దయానంద సెలవు ప్రకటించారు. బెంగళూరులోని మెట్రో సేవలు మాత్రం బంద్ తో ప్రభావితం కాకుండా యథావిధిగా పని చేస్తున్నాయి.


కావేరీ జలాల వివాదం నేపథ్యంలో ఫ్రీడమ్ పార్క్ లో   ఆందోళన చేస్తున్న ఓ రైతు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రెండోసారి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. రైతును అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. 


కావేరీ జలాల ఆందోళన నేపథ్యంలో నటుడు కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు. కన్నడ భూమి, నీరు, భాషకు సంబంధించిన అన్ని పోరాటాల్లో నేను ఎప్పుడూ మీతో ఉంటాను అని చెప్పారు. వానలు కురవక పోవడంతో ప్రజల వ్యవసాయమే కాకుండా రైతులకు తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందిగా మారిందని.. వానాకాలం తప్ప మనకు తాగునీటి వనరులు లేవని అన్నారు. 'మనం కావేరీ నదిపై ఆధారపడతాం. నాకు తెలిసినంత వరకు కరవు అధ్యయనం కమిటీ- కావేరీ కమిటీ సాంకేతిక నిపుణులు కర్ణాటకలో ప్రస్తుత కరవు పరిస్థితుల గురించి ట్రైబ్యునల్ కోర్టును, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ఒప్పించాలి. మన నీరు మన హక్కు' అని కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు.