Crime news : విమానంలో ఎయిర్ హోస్టెస్‌కు ముద్దు పెట్టేందుకు యత్నించి ఓ బంగ్లాదేశీయుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న విస్తారా విమానం ‘యూకే 234’ మస్కట్ నుంచి ఢాకా బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున 4:25 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి కేవలం 30 నిమిషాల ముందు అందులో ప్రయాణిస్తున్న మహమ్మద్ దులాల్ అనే వ్యక్తి తన సీటు నుంచి లేచాడు. పక్కనే ఉన్న ఎయిర్ హోస్టెస్‌ను కౌగిలించుకున్నాడు.
అంతటితో ఆగలేదు. ఆమె తేరుకునే లోపే ముద్దు పెట్టేందుకు యత్నించాడు. ఈ హఠాత్పరిణామాన్ని చూసి మిగతా ప్రయాణికులు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే అతను ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎయిర్‌హోస్టెస్ బాధతో విలవిలలాడింది. తోటి సిబ్బందిని సాయం కోసం అరవడంతో వారు అక్కడికి వచ్చి ప్రయాణికుల సాయంతో ఆమెను దులాల్ బారి నుంచి విడిపించారు. విమానయాన సిబ్బంది మందలించినా.. వారితోనూ అసభ్యంగా ప్రవర్తించాడు. గొడవ పడ్డాడు. చివరికి కెప్టెన్ జోక్యం చేసుకొని రెడ్ వార్నింగ్ కార్డ్ చదివాడు. అతడిని వికృత ప్రయాణికుడిగా ప్రకటించాడు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన తరువాత నిందితుడిని భద్రతా సిబ్బందికి అప్పగించారు.
ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుణ్ని అరెస్టు చేశారు. భద్రతా సిబ్బంది దులాల్‌ను సహర్ పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. 2023 సంవత్సరంలోనే ముంబైలో ప్రయాణికుల వికృత ప్రవర్తన కింద నమోదైన 12వ కేసు ఇది. అరెస్టు అనంతరం దులాల్‌ను అంధేరీ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడి తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. దులాల్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, ఇంగ్లిష్, హిందీ అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని వాదనలు వినిపించారు. తన క్లయింట్ మానసిక స్థితి, భాషా పరిమితుల కారణంగా తప్పుడు ఆరోపణలు చేశారని న్యాయవాది చెప్పారు.
బాధితురాలి తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ విమాన సిబ్బందిపై దులాల్ అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ముద్దు పెట్టుకోవాడానికి యత్నించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారని, తోటి ప్రయాణికులు జోక్యం చేసుకున్నా, ఫ్లైట్ కెప్టెన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వికృతంగా ప్రర్తించారని అన్నారు. ప్రయాణికుల నుంచి ఎయిర్‌హోస్టెస్ ఫుడ్ ట్రేలను సేకరిస్తున్నప్పుడు దులాల్ ఆమెను అడ్డుకున్నాడని, ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని వాదించారు. ఫ్లైట్‌లోని ఇతర ఉద్యోగులు, ప్రయాణికుల సాయంతో దులాల్‌ను అడ్డుకోగలిగినట్లు చెప్పారు.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడిని శుక్రవారం వరకు పోలీసు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే విషయాన్ని బంగ్లాదేశ్ కాన్సులేట్‌కు అధికారులు సమాచారం అందించారు. దులాల్ బెయిల్, ఇతర కేసు సంబంధిత విధానాలకు సంబంధించిన ఏర్పాట్లు శుక్రవారం విచారణ జరిగింది. ఘటనపై విస్తారా విమాన సంస్థ స్పందించింది. తమ ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందని ప్రకటించింది. వికృత ప్రవర్తన వంటి చర్యలను ఎంత మాత్రం సహించబోదని స్పష్టం చేసింది.