National News: పులస అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరని అనుకోం. జూన్ జులైలో లభించే ఈ చేప కోసం జనం భారీగా ఎగబడతారు. అలాంటి  టేస్టీ ఫిష్  భారత్- బంగ్లాదేశ్‌ మధ్య కాక పుట్టిస్తోంది. దీన్ని మన దగ్గర పులస అంటారేమో కానీ.... బెంగాల్‌లో మాత్రం హిల్సా అంటారు. ఎంతో ప్రీతిపాత్రమైన హిల్సా చేప లేకుండానే బెంగాల్ ప్రజలు దుర్గామాత పూజలు జరుపుకొనే పరిస్థితి వచ్చింది. తమ దేశ ప్రజలకు సరిపడ ఈ హిల్సా(సముద్రలో ఉంటే హిల్సా అంటారు)ను అందించేందుకే ఈసారి భారత్‌కు పంపలేక పోతున్ననట్లు యూనస్‌ సర్కారు అనధికారిక లీకులు ఇస్తున్నప్పటికీ.. అసలు విషయం మాత్రం.. బంగ్లా అల్లర్లు తర్వాత ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడమే అసలు కారణంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ప్రపంచం మొత్తం వినియోగంలో 70 నుంచి 80 శాతం హిల్సా బంగ్లా నుంచే:


 పశ్చిమ బెంగాల్ ప్రజలకు దుర్గా నవరాత్రుల సమయంలో జరిపే దుర్గా పూజలో ఈ హిల్సాకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భారత్ ఆ సమయంలో భారీ ఎత్తున బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈసారి ఇరు దేశాల మధ్య రాజకీయంగా కొంత ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. బంగ్లా ప్రజలకు మాల్‌ న్యూట్రిషన్ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా హిల్సా ఎగుమతులపై నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది. బంగ్లా ఆపద్ధర్మ ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ లైవ్‌ స్టాక్‌కు సలహాదారుగా ఉన్న ఫరీద అక్తర్ కామెంట్స్ ఇందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా తింటున్న  హిల్సాలో దాదాపు 70 నుంచి 80 శాతం తమ దేశం నుంచే విదేశాలకు ఎగుమతి అవుతున్నప్పటికీ బంగ్లాదేశ్ ప్రజలకు మాత్రం అందుబాటులో లేకుండా పోతోందని.. విదేశీ ఎగుమతులుపై నిషేధం విధించడం ద్వారా.. బంగ్లా ప్రజలకు సరసమైన ధరల్లో హిల్సా  అందించే దిశగా నిర్ణయాలు సాగుతున్నట్లు ఫరీదా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. అందుకే ఈ ఏడాది దుర్గపూజ కోసం భారత్‌కు చేపలు పంపొద్దని తాను సంబంధిత మంత్రిత్వ శాఖకు సలహా ఇచ్చినట్లు ఫరీదా చెప్పినట్లు ఢాకా ట్రిబ్యూన్‌ పేర్కొంది. హిల్సా సాంక్చ్యురీలను,  వాటి ఆవాసాలను కాపాడడంపై ప్రధానంగా తాము దృష్టి పెడుతున్నట్లు ఫరీదా తెలిపారు. భారత్‌కు అక్రమంగా పులస ఎగుమతి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌కు ఎగుమతులు నిలుపుదలపై ఇప్పటి వరకూ ఏ విధమైన ఉత్తర్వులు అయితే వెలువడ లేదు.


మరోసారి తెరపైకి “హిల్సా డిప్లొమసి”:


భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్స్‌లో పద్మ నదిలో దొరికే హిల్సాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే దీనిని హిల్సా డిప్లొమసీగా ఇరు దేశాలు పేర్కొంటుంటాయి. పద్మ పులసను తమ దేశ ప్రజలకు అందించడమే తమ ప్రధాన లక్ష్యంగా బంగ్లా చెబుతున్నప్పటికీ.. దాని వెనుక ఉన్న ప్రధాన కారణం మాత్రం షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడమేనని ప్రపంచ రాజకీయాల నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగ్లావ్యాప్తంగా భారత్‌కు యాంటీగా సెంటిమెంట్‌ బలపడుతున్న వేళ.. ప్రజలను శాంతింప చేసేందుకు దుర్గపూజకు హిల్సాను సరఫరా నిలిపి వేసే దిశగా చర్యలు ఉండవచ్చు అంటున్నారు.


గతంలోనూ భారత్‌కు హిల్సా ఎగుమతిపై నిషేధం:


2012లోనూ నాటి హసీనా సర్కారు భారత్‌కు పద్మ హిల్సా ఎగుమతిపై నిషేధం విధించింది. మమతబెనర్జీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వాన్ని బంగ్లా సర్కార్‌తో సంప్రదింపులు జరపాల్సిందిగా అనేక సార్లు సూచించారు. తాను కూడా నేరుగా హసీనా చర్చలు జరిపి 2020 నుంచి తిరిగి భారత్‌లోకి ముఖ్యంగా దుర్గాపూజల సమయంలో బెంగాల్‌కు హిల్సా చేపలు దిగుమతి అయ్యేలా ఒప్పించారు. సాధారణంగా హిల్సాను భారత్‌కు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మాసాల మధ్యలో బంగ్లాదేశ్ ఎగుమతి చేస్తుంది. గతేడాది సెప్టెంబర్ 21న పెట్రాపోల్ లాండ్ పోర్టు ద్వారా 9 కంటైనర్లలో 45 టన్నుల హిల్సాను పశ్చిమ బెంగాల్‌కు ఎగుమతి చేసింది. మొత్తంగా భారత్‌తో సంబంధాల బలోపేతంలో భాగంగా గుడ్ గెక్చర్‌ కింద దాదాపు 3 వేల 950 టన్నుల  వరకు భారత్‌కు గతేడాది పంపింది. ఈ సంవత్సరం మాత్రం దేశ ప్రజలఅవసరాలు తీర్చే నెపంతో భారత్‌కు ఎగుమతులు నిలపాలని నిర్ణయించుకున్న ఆపద్ధర్మ సర్కారుకి లోలోపల ఉన్నది మాత్రమే రాజకీయ కారణాలే.


Also Read: ఉన్నోళ్లకి ఒబేసిటీ, లేనోళ్లకి అనీమియా - అత్యంత దారుణంగా దేశంలో పిల్లల పరిస్థితి