కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని ఓ రెస్టారెంట్‌లో షావర్మా తిన్న తర్వాత ఫుడ్‌పాయిజన్‌తో 58 మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ బాలిక మృతి చెందారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ ఏర్పడిందని కాసరగోడ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ వి రాందాస్ తెలిపినట్లు మీడియా పేర్కొంది. కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజనింగ్ బాధితుల రక్తం, మల నమూనాలను పరీక్షించిన తర్వాత షిగెల్లా ఉనికిని కనుగొన్నట్లు అధికారి తెలిపారు.


బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ సోకి మృతి చెందిన బాలికను దేవానంద (16)గా గుర్తించారు. అపరిశుభ్రత, సరిగా ఉడకని లేదా కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా షిగెల్లా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఇది పేగు ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుందని, ఇది అంటువ్యాధి అని జిల్లా వైద్యాధికారి తెలిపారు.






ఇది భయాందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్‌ మనోజ్‌ తెలిపారు. కలుషిత ఆహారం, నీరు తీసుకున్న తర్వాత చాలా మంది వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. అంతా వాంతులు, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలను కలిగి ఉన్నారని వివరించారు. ఈ కేసులను నిశితంగా పరిశీలించాలని జిల్లాలోని అన్ని ఆసుపత్రులకు తెలియజేశామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 


బాక్టీరియా ఎలా వ్యాపిస్తుంది, వ్యాధి సోకకుండా ఎలా నివారించాలి, నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సామాన్యులకు, దాబాల యజమానులకు అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం, ఆరోగ్యశాఖ అధికారులు కృషి చేస్తున్నారని ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. స్వీట్ దుకాణాలు, ఇతర ఆహారపదార్థాలు అమ్మే హోటల్స్‌, రెస్టారెంట్లను ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు నీటి సరఫరాపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రధానంగా కలుషిత ఆహారం మరియు నీటి ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని, దీనిని నియంత్రించడానికి పరిశుభ్రత ముఖ్యమైన అంశం అని ఆయన అన్నారు.