Assembly Elections 2023 Live Updates: 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని ప్రకటిస్తున్న ఎన్నికల సంఘం

5 States Assembly Elections 2023 Dates Live: మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల ఎన్నికల తేదీల్ని ప్రకటించనుంది.

Ram Manohar Last Updated: 09 Oct 2023 12:40 PM
5 రాష్ట్రాల పోలింగ్ తేదీలు ప్రకటన

 
5 రాష్ట్రాల పోలింగ్ తేదీలు ఇలా..


మధ్యప్రదేశ్: నవంబర్ 17


రాజస్థాన్‌: నవంబర్ 23


ఛత్తీస్‌గఢ్‌ (రెండు విడతల్లో) : నవంబర్ 7, 17


తెలంగాణ: నవంబర్ 30


మిజోరం: నవంబర్ 7


ఫలితాల ప్రకటన : డిసెంబర్ 3

5 రాష్ట్రాల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లు

5 రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలున్నట్టు చెప్పిన సీఈసీ...ఈ రాష్ట్రాల్లో 40 రోజుల పాటు పర్యటించామని తెలిపారు. ఈ 5 రాష్ట్రాల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లున్నారని చెప్పారు.

యువ ఓటర్లపై ఫోకస్

యువ ఓటర్ల నమోదుపై ఎక్కువగా దృష్టి సారించినట్టు రాజీవ్ కుమార్ వెల్లడించారు. దివ్యాంగులకూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

ఎన్నికల తేదీని ప్రకటిస్తున్న సీఈసీ

5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటిస్తున్నారు. 

బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొడుతుందా?

తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలో గెలుపెవరిది అన్నది.. ఈసారి స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నారు విశ్లేషకులు. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌పై ఆశలు పెట్టుకున్నా... ఈసారి స్పష్టమైన మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కాంగ్రెస్ ధీమా

అన్ని రాష్ట్రాల్లోనూ గెలుస్తామన్న ధీమాతో ఉంది కాంగ్రెస్. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే రాహుల్ గాంధీ రెండు ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లోనూ పర్యటించారు. 

మోదీ బహిరంగ సభలు

మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకూ ప్రధాని నరేంద్ర మోదీ 10 పబ్లిక్‌ మీటింగ్స్‌కి హాజరయ్యారు. రాజస్థాన్‌లో 9, ఛత్తీస్‌గఢ్ 4, తెలంగాణలో నాలుగు సార్లు భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 9 ఏళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధి గురించి వివరించారు. 


 

తెలంగాణ ఎన్నికల్లో యువతదే పైచేయి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఎక్కువగా ప్రభావం చూపనున్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం ఏడు లక్షల మంది తొలిసారి ఓటు నమోదు చేసుకోగా... 35ఏళ్లలోపు ఓటర్లు 30శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్రంలోని 3.14 కోట్ల మంది ఓటర్లలో దాదాపు ఏడు లక్షల మంది 18 నుంచి 19 ఏళ్ల మధ్య వారే.  అలాగే, 75 లక్షల మంది ఓటర్లు 19 నుంచి 35  ఏళ్ల మధ్య వారే ఉన్నారు. 

మధ్యప్రదేశ్‌లో 5.52 కోట్ల మంది ఓటర్లు

మధ్యప్రదేశ్‌లో 5 కోట్ల 52 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 2.85కోట్ల మంది పురుషులు కాగా...2.67 కోట్ల మంది మహిళలున్నారు. ఈ సారి కొత్తగా 18 లక్షల మంది ఓటర్లను చేర్చినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 

తదుపరి అధికారం ఎవరిదో..?

ప్రస్తుతం తెలంగాణలో BRS అధికారంలో ఉండగా..మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మిజోరంలో బీజేపీ మిత్రపక్షమైన మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) ప్రస్తుతం అధికారంలో ఉంది.

ముస్లింలదే కీలక పాత్ర

ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ముస్లిం ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. మధ్యప్రదేశ్‌లో 6.57%,రాజస్థాన్‌లో 9.07%, ఛత్తీస్‌గఢ్ 2.02% మంది ముస్లింల జనాభా ఉంది. తెలంగాణలో 12.69%, మిజోరంలో 1.35% మేర ముస్లింలు ఉన్నారు. 

అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ

మిజోరంలో ఈ డిసెంబర్‌లో అసెంబ్లీ గడువు ముగిసిపోతుంది. ఇక ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణలో వచ్చే ఏడాది జనవరిలో అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ ఈసీ బృందం పర్యటించి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసింది. 

ఏయే రాష్ట్రంలో ఎన్ని సీట్లంటే..

మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో 90, మధ్యప్రదేశ్‌లో 230,తెలంగాణలో 119 నియోజకవర్గాలున్నాయి. ఇక రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ సీట్‌లున్నాయి. 

12 గంటలకు ఎన్నికల తేదీలు ప్రకటన

మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించనుంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 





Background

5 States Assembly Elections: 


5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఢిల్లీలో పోలీసులు, వ్యయాలు, సాధారణ విభాగాలకు సంబంధించిన పరిశీలకులతో సీఈసీ రాజీవ్‌ కుమార్‌ సమీక్ష జరిపారు.  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ధన బలాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.


ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. పార్టీలు, అభ్యర్థులు పంపిణీ చేసే ధన బలాన్ని పూర్తిగా కట్టడి చేయాలని అబ్జర్వర్లను నిర్దేశించారు రాజీవ్ కుమార్. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధన, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థంగా అమలు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై ధనం, కండ బలం ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈసీ అమలు చేయనుంది. 


ఇటీవల ఆన్ లైన్ నగదు బదిలీ అభ్యర్థులకు అనుకూలంగా మారిందని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఆ విధంగా ప్రలోభ పెట్టినా కూడా తమకు తెలిసిపోతుందని, ఆన్‌ లైన్‌ లో నగదు బదిలీల వివరాలను తెలుసుకునేందుకు బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించనుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సహకారం కూడా తీసుకుంటున్నట్టు సీఈసీ తెలిపారు. సీ విజిల్‌ యాప్‌ ద్వారా ప్రజలు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చని, ఫొటోను యాప్‌ లో అప్‌లోడ్‌ చేస్తే 100 నిముషాల వ్యవధిలో అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేసి, ఫిర్యాదుదారుడికి సమాచారమిస్తారని రాజీవ్ కుమార్ తెలిపారు.  



గత ఎన్నికల్లో తెలంగాణలో 73.37 శాతం పోలింగు నమోదైంది. 29 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ 60 శాతం కంటే తక్కువగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్ శాతం పెంచడంపై ఫోకస్ పెడుతున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో 35,356 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మహిళలకు 597 ప్రత్యేక కేంద్రాలు, దివ్యాంగులకు 120 కేటాయించారు. ఒక్కో సెగ్మెంట్ లో యువతకు ఒక పోలింగ్ కేంద్రం కేటాయించనుంది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది. 


- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.