Yuvi Stunning 50: ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ సిరీస్ టోర్నీలో భార‌త వెట‌ర‌న్ ప్లేయ‌ర్ యువ‌రాజ్ సింగ్  (30 బంతుల్లో 59, 7 సిక్సర్లు, 1 ఫోర్) సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీ ఫైనల్లో యూవీ త‌న విశ్వ‌రూపం చూపించాడు. ఈ మ్యాచ్ లో ఏడు సిక్స‌ర్లు బాది ప్ర‌త్య‌ర్థిని కుదేలు చేశాడు. ముఖ్యంగా స్పిన్న‌ర్ మెక్ గెయిన్ బౌలింగ్ ను చీల్చి చెండాడి, గ‌తంలో యూవీని గుర్తుకు తెచ్చాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో ఇంగ్లాండ్ పై ఆరు బంతుల్లో ఆరు సిక్స‌ర్లు బాదిన రోజుల‌ను మెమ‌రీలోకి తెచ్చాడు. నాకౌట్ లో ఆసీస్ ఎదురైతే రెచ్చిపోయే ఆన‌వాయితీని యూవీ కొన‌సాగించాడు. 2000 ఐసీసీ నాకౌట్ టోర్నీలో ఆస్ట్రేలియాపై ఫిఫ్టీతో స‌త్తా చాటిన యూవీ.. ఆ త‌ర్వాత 2007 సెమీస్ లో నూ 70 ప‌రుగులు సాధించి జ‌ట్టును గెలిపించాడు. ఇక 2011 క్వార్ట‌ర్స్ లో కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడి కంగారూల‌ను మ‌ట్టి క‌రిపించాడు. మ‌రోసారి మాస్ట‌ర్స్ టోర్నీలో కంగారూల‌కు త‌న త‌డాఖా చూపించాడు. 

ఫైన‌ల్లో భార‌త్..  రాయ్ పూర్ లో జ‌రిగిన మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ కు దిగిన 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 220 ప‌రుగులు  చేసింది. యువ‌రాజ్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీతో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. స‌చిన్ టెండూల్క‌ర్ (42), స్టువ‌ర్ట్ బిన్నీ (36) స‌త్తా చాటారు. నిజానికి ఆట ఆరంభంలోనే తెలుగు ప్లేయ‌ర్ అంబ‌టి రాయుడు వికెట్ కోల్పోయినా ఇండియ‌న్ మాస్ట‌ర్స్ టీమ్ ను స‌చిన్, యూవీ ఆదుకున్నారు. ఆ త‌ర్వాత మిగ‌తా బ్యాట‌ర్లు కూడా త‌లో చేయి వేయ‌డంతో జ‌ట్టు భారీ స్కోరు సాధించింది. బౌల‌ర్ల‌లో జేవియ‌ర్ డోహెర్తి, డాన్ క్రిస్టియ‌న్ ల‌కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. బెన్ హిల్ఫెన్ హాస్, స్టీవ్ ఓ కీఫ్, నాథ‌న్ కౌల్ట‌ర్ నీల్ ల‌కు తలో వికెట్ ద‌క్కింది. 

ఛేద‌న‌లో తుస్.. ఛేజింగ్ లో ఆరంభంలోనే ఆసీస్ కు ఎదురుదెబ్బ త‌గిలింది. కెప్టెన్ షేన్ వాట్స‌న్ (5) త్వ‌ర‌గా ఔట‌య్యాడు. షాన్ మార్ష్, బెన్ డంక్, నాథ‌న్ రియ‌ర్డ‌న్ ల‌కు  త‌లో 21 ప‌రుగుల‌తో రాణించారు. బెన్ క‌టింగ్ (39) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఈ టోర్నీలో భారీ స్కోర్లు న‌మోదు చేసిన ఆసీస్.. నాకౌట్ మ్యాచ్ లో మాత్రం భారీ స్కోరును ఛేదించ‌లేక‌పోయింది. భార‌త బౌల‌ర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయ‌డంతో కంగారూలు కోలుకోలేక పోయారు. భార‌త బౌల‌ర్ల‌లో షాబాజ్ న‌దీమ్ నాలుగు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. విన‌య్ కుమార్, ఇర్ఫాన్ ప‌ఠాన్ ల‌కు చెరో రెండు, బిన్నీ, ప‌వ‌న్ నేగిల‌కు చెరో వికెట్ ద‌క్కింది. మొత్తం మీద 94 ప‌రుగుల‌తో ఇండియా ఘ‌నవిజ‌యం సాధించింది. న‌దీమ్ కు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.  శ్రీలంక‌, వెస్టిండ‌స్ జ‌ట్ల మ‌ధ్య మ‌రో సెమీస్ లో గెలిచిన జ‌ట్టుతో భార‌త్ ఫైన‌ల్లో త‌ల‌ప‌డుతుంది. ఫైన‌ల్ ఆదివారం ఇదే వేదిక‌పై జ‌రుగుతుంది.