Mi Pacer Bumrah will miss IPL Intial Stages: అనుకున్నట్లే జరిగింది. ఐపీఎల్ 2025 సీజన్ కు గాను భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. మార్చి మొత్తానికి దూరం కానున్నాడు. తను ఏప్రిల్ లో ముంబై ఇండియన్స్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. అది కూడా బీసీసీఐ మెడికల్ టీమ్ ఇచ్చే రిపోర్టును బట్టి ఉంటుందని సమాచారం. ఈక్రమంలో ముంబై తరపున బుమ్రా ఎన్ని మ్యాచ్ లు మిస్సవుతాడో ప్రస్తుతానికి తెలియదు. గత జనవరిలో సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులో వెన్నునొప్పికి గురైన బుమ్రా.. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు అతని గాయంపై క్లారిటీ రాలేదు. తనెప్పుడు కోలుకుంటాడో తెలియదు. నిజానికి ప్రారంభంలో రెండు, మూడు వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని భావించారు. అయితే జనవరి నుంచి ఇప్పటివరకు తను ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబైకి బుమ్రా సేవలు మార్చి మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక గతేడాది బుమ్రా అద్భుతంగా రాణించాడు. టీ20 ప్రపంచకప్ తోపాటు బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచి సత్తా చాటాడు. అలాగే ఐసీసీ మేల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కైవసం చేసుకున్నాడు.
ముంబై షెడ్యూల్ ఇలా..
ముంబై ఆరంభ మ్యాచ్ ల షెడ్యూల్ ను పరిశీలించినట్లయితే తొలి రెండు మ్యాచ్ లను వేరే జట్ల గ్రౌండ్లలో ఆడనుంది. ఈనెల 23న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ తో అలాగే 29న గుజరాత్ టైటాన్స్ తో అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ లు జరుగుతాయి. ఆ తర్వాత ఈనెల 31న ముంబైకి తిరిగి వచ్చి, కోల్ కతా నైట్ రైడర్స్ తో వాంఖడే వేదికగా ముంబై మ్యాచ్ ఆడనుంది. అనంతరం తదుపరి మ్యాచ్ ను లక్నోలో.. లక్నో సూపర్ జెయింట్స్ తో ఏప్రిల్ నాలుగున ఆడుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 7న రాజస్థాన్ రాయల్స్ తో సొంతగడ్డపై తమ లీగ్ మ్యాచ్ ను ఆడుతుంది.
పటిష్టంగా బౌలింగ్ లైనప్..
బుమ్రా ఆరంభంలో దూరమైనప్పటికీ, జట్టులో నాణ్యమైన పేసర్లకు లోటు లేదు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, రీస్ టోప్లీ, కార్బిన్ బోష్, కెప్టెన్ హార్దిక్ పాండ్యలాంటి వారితో పటిష్టంగా ఉంది. అలాగే అర్జున్ టెండూల్కర్, సత్యనారాయణ రాజు, అశ్వని కుమార్, రాజ్ అంగద్ బవాలు కూడా పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ టోర్నీని ఐదుసార్లు గెలిచి, లీగ్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. అయితే గతేడాది చెత్త ప్రదర్శనతో టోర్నీ చరిత్రలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అలాగే గతేడాదే రోహిత్ శర్మ నుంచి హార్దిక్ సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. గతంతో కంటే ఈసారి జట్టు మరింత పటిష్టంగా కనిపిస్తుండటంతో ఆరో టైటిల్ పై ముంబై కన్నేసింది.