Asaduddin Owaisi:



సభలోనే కొడతారేమో: అసదుద్దీన్ ఒవైసీ


బీఎస్‌పీ ఎంపీ దనీష్ అలీని ఉగ్రవాది అంటూ లోక్‌సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరి చేసిన వ్యాఖ్యల దుమారం ఆగడం లేదు. ఓ ముస్లి ఎంపీని ఇంత మాట అంటే...బీజేపీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండి పడుతున్నాయి విపక్షాలు. ప్రధాని నరేంద్ర మోదీపైనా విమర్శలు చేస్తున్నాయి. AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యల్ని ఖండించిన ఆయన...పార్లమెంట్‌లో ఓ ముస్లిం ఎంపీ మూకదాడి జరిగే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్...ఈ వ్యాఖ్యలు చేశారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాసం నినాదం సంగతేంటని ప్రధాని మోదీని ప్రశ్నించారు. 


"ఓ బీజేపీ ఎంపీ పార్లమెంట్‌ సాక్షిగా ముస్లిం ఎంపీని అవమానించారు. ఆయన మాట్లాడిన తీరుని అందరూ ఖండిస్తున్నారు. పార్లమెంట్‌లో అలాంటి భాష వాడకూడదని మండి పడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఓ ఎంపీ వైఖరి ఇలా ఉండడం దురదృష్టకరం. పార్లమెంట్‌లో ఓ ముస్లిం ఎంపీ మూకదాడి జరిగే రోజులు ఎంతో దూరం లేవు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ అని నినాదాలు వినిపించే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడేమంటారు..? ఆ నినాదమేమైపోయింది."


- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్






ఇదీ జరిగింది..


పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరిగిన సమయంలో చర్చ జరుగుతుండగా బీఎస్‌పీ ఎంపీ దనీష్ అలీని రమేశ్ బిదూరి "ఉగ్రవాది" అంటూ పదేపదే అనడం సభలో గందరగోళం సృష్టించింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బీజేపీ ఎంపీకి వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కానీ...అప్పటికే విపక్షాలు గొడవకు దిగాయి. రమేశ్ బిదూరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. దనీష్ అలీ కూడా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. లోక్‌సభలో అందరి ముందు తనను ఉగ్రవాది అనడం చాలా బాధ కలిగించిందని ఆవేదన చెందారు. అయితే...రమేశ్ బిదూరికి మరో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే కూడా సమర్థించారు. పదేపదే స్పీచ్‌కి అడ్డుతగిలారని, అందుకే ఆ కోపంతో అనాల్సి వచ్చిందని చెప్పారు. ఇది కూడా వివాదాస్పదమవుతోంది. రమేష్ బిదూరి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. గతంలో బిదూరి చేసిన  వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా, సొంత పార్టీ నేతలు ఖండించారు. అంతేకాకుండా షోకాజ్ నోటీసు అందుకున్నారు. తాజాగా దనిష్ అలీపై వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎన్‌సీపీతో సహా ప్రతిపక్ష పార్టీలు అలీకి మద్దతుగా నిలిచాయి. బిదూరిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. 


Also Read: రూమ్‌లో ఫుల్‌గా ఏసీ పెట్టుకుని పడుకున్న డాక్టర్, చలికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు మృతి