National News in Telugu:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను కేంద్ర దర్యాప్తు సంస్థ CBI అదుపులోకి తీసుకుంది. లిక్కర్‌ కేసులో తిహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. రౌస్‌ అవెన్యూ కోర్టులోని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. దిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి కేజ్రీవాల్‌ను విచారించాల్సి ఉందని... సీబీఐ  తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వెనకు పెద్ద కుట్ర ఉందని.. దాన్ని వెలికితీయాలంటే కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో రౌస్‌ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చింది. అయితే సీబీఐ వాదనతో విభేదించిన కేజ్రీవాల్‌ అసలు తనకు ఈ  కేసుతో సంబంధం లేదని తెలిపారు. అయితే తనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్న కేజ్రీవాల్‌ విజ్ఞప్తికి కోర్టు సమ్మతించింది.

 

బెల్ట్‌, భగవద్గీతకు అనుమతి
  

మూడు రోజుల సీబీఐ కస్టడీలోకి వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భగవద్గీతను, ఇంట్లో వండిన ఆహారాన్ని తెచ్చుకునేందుకు అనుమతి కోరారు. వైద్యులు సూచించిన మందులు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. తన భార్య, బంధువులను రోజూ ఒక గంట కలవడానికి కూడా కేజ్రీవాల్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. తిహార్‌ జైలులో అధికారులు తన బెల్ట్ తీసుకున్నారని... దాని వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని కేజ్రీవాల్‌ కోర్టుకు తెలిపారు. తీహార్ జైలుకు వెళ్తుంటే తన ప్యాంట్ జారిపోతోందని... తనకు ఒక బెల్ట్‌ కూడా కావాలని సీఎం అరవింద్ కేజీవాల్ విజ్ఞప్తి చేశారు. తనకు అవసరమైన వస్తువుల జాబితాలో బెల్ట్ అడగడం మర్చిపోయినట్లు రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ అమితాబ్ రావత్‌కు..దిల్లీ సీఎం తెలిపారు. కేజ్రీవాల్‌ అభ్యర్థనను కోర్టు మన్నించింది. 

 

జూన్‌ 29న మళ్లీ కోర్టు ముందుకు

మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను జూన్ 29 రాత్రి 7 గంటలకు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. బుధవారం ఆయనను సీబీఐ అధికారికంగా అరెస్టు చేసింది. అరెస్టు చట్టవిరుద్ధమని  ప్రకటించాలని డిఫెన్స్‌ తరపు న్యాయవాది కోరగా కోర్టు తిరస్కరించింది. అయితే కోర్టులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను నిందితుడిగా పేర్కొంటూ తాను సీబీఐకి కానీ ఈడీకి కానీ ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని కేజ్రీవాల్‌ కోర్టుకు తెలిపారు. తాను నిర్దోషినని తన పరువు తీయాలనే ఈ కుట్ర జరుగుతోందని... సీబీఐ కూడా ఆ కుట్రలో భాగం అవుతోందని కేజ్రీవాల్‌ కోర్టుకు తెలిపారు. అయితే గతంలో రౌస్‌ అవెన్యూ కోర్టు  కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వగా దీనిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ పూర్తి చేసిన ఢిల్లీ న్యాయస్థానం బెయిల్‌పై స్టే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఢిల్లీ హైకోర్టు తన బెయిల్‌ పై స్టే విధించడంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కేజ్రీవాల్‌ తర్వాత ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. హైకోర్టులో పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసిందని ఇక సుప్రీంలో సమగ్ర పిటిషన్‌ వేస్తామని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది తెలిపారు.