New Criminal Laws in india : తనకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ఇది తమ పరిధి కాదంటూ పోలీసులు పంపించేయడం వల్ల ఇబ్బందులు పడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ తరహా ఇబ్బందులకు చెక్ చెప్పేలా జూలై ఒకటో తేదీ నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు అమలులోకి రాబోతున్నాయి. ప్రధానంగా జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లోనే ఫిర్యాదుల స్వీకరణ వంటి నూతన విధానాలు బాధితులకు మేలు చేకూర్చనున్నాయి. జీరో ఎఫ్ఐఆర్ అమలులోకి వస్తే పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం బాధితులకు లభిస్తుంది. పోలీసులు కూడా తప్పకుండా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. వచ్చేవారం నుంచి అమలులోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాలతో నేర దర్యాప్తు, విచారణ ప్రక్రియలో కీలక మార్పులు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో ఫిర్యాదులు, ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమన్ల జారీ, హేయమైన నేరాలకు సంబంధించిన నేర దృశ్యాలను తప్పనిసరిగా వీడియోగ్రఫీ చేయడం లాంటి మార్పులతో దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ కొత్త చట్టాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ కూడా భారీ ఎత్తున కసరత్తు ప్రారంభించింది. దాదాపు 40 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బందికి 5.65 లక్షల మంది పోలీసులు, జైళ్ళ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులకు శిక్షణ ఇవ్వనుంది. గతేడాది భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియమ్ 2023 చట్ట రూపం దాల్చిన నేపథ్యంలోనే ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవి బ్రిటిష్ వలస పాలన కాలంనాటి ఐపిసి, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో నూతనంగా తీసుకువచ్చి అమలు చేయబోతున్నారు. 


కొత్త చట్టాలతో రాబోయే మార్పుల్లో కొన్ని ఇవే..


కొత్త చట్టాలు అమలులోకి రావడం వల్ల అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. వీటిలో కొన్నింటిని పరిశీలిస్తే.. బాధితుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేసుకోవచ్చు. అరెస్టు సందర్భాల్లో బాధితులు, సన్నిహితులు, బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా బాధితులు తక్షణ సహాయం పొందే అవకాశం ఉంటుంది. అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ తోపాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు. తద్వారా అరెస్టు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితులు కుటుంబీకులు, స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది. హేయమైన నేరాల్లో ఇకనుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి. వారు సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి. దీనివల్ల దర్యాప్తులో నాణ్యత, విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 


ఈ తరహా నేరాలకు అధిక ప్రాధాన్యత..


మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి. అంతేకాకుండా బాధిత మహిళలు, చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇవ్వనున్నాయి. ఇక సమన్లు ఎలక్ట్రానిక్ విధానం ద్వారా పంపించవచ్చు. మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలు వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి. బాధితులతోపాటు నిందితులు కూడా ఎఫ్ఐఆర్ నకళ్ళను ఉచితంగా పొందే వీలుంది. వీటితోపాటు పోలీసు రిపోర్టు, చార్జిషీట్ స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లను 14 రోజుల్లోగా పొందవచ్చు. కేసు విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి, సకాలంలో న్యాయం అందేలా చేయడానికి న్యాయస్థానాలు కూడా గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి. సాక్షుల భద్రతను, వారి సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలు వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో lపాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వీళ్ళు తమ నివాసం ఉన్నచోటే పోలీసులు సాయం పొందవచ్చు.