Army Chief: చైనా ఉద్దేశం అదే అయితే భారత్ టార్గెట్ ఇదే: ఆర్మీ చీఫ్

ABP Desam   |  Murali Krishna   |  09 May 2022 11:25 PM (IST)

Army Chief: సరిహద్దు వివాదం పరిష్కారం కాకుండా ఉంచడమే చైనా ఉద్దేశమని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు.

చైనా ఉద్దేశం అదే అయితే భారత్ టార్గెట్ ఇదే: ఆర్మీ చీఫ్

Army Chief: భారత సైన్యాధిపతిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జనరల్ మనోజ్ పాండే చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదం పరిష్కారం కాకుండా ఉంచడమే చైనా ఉద్దేశమని మనోజ్​ పాండే అన్నారు. సరిహద్దులో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందన్నారు.

చైనా ఉద్దేశం సరిహద్దు సమస్యను సజీవంగా ఉంచడమే. అందుకే వివాదం ప్రాథమిక పరిష్కారం లేకుండానే మిగిలిపోయింది. దౌత్య, సైనిక చర్చలతో పాంగోంగ్​ సో, గోగ్రా, గల్వాన్​లో మోహరించిన బలగాలను ఉపసంహరించుకున్నాం. మిగిలిన ప్రాంతాల్లోనూ చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కొనేలా బలగాలను మోహరించాం. ఏప్రిల్​ 2020కి ముందు ఉన్న స్థితిని పునరుద్ధరించడమే మా లక్ష్యం.                                             -  జనరల్ మనోజ్ పాండే, సైన్యాధిపతి

పాండే ప్రొఫైల్

భారత నూతన సైన్యాధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఎంఎం నరవాణే స్థానంలో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా పాండే నియమితులయ్యారు. జనరల్ పాండే ఫిబ్రవరిలో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాద్యతలు చేపట్టి, ఈస్టర్న్ ఆర్మీ కమాండ్‌కు నాయకత్వం వహిస్తూ, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టర్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి భద్రత, రక్షణ బాధ్యతలను నిర్వహించారు.

చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఎంపికైన తొలి అధికారి జనరల్ పాండే. ఆయన నియామకంపై ప్రకటన వెలువడిన వెంటనే భారత సైన్యం ట్విటర్ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.

కీలక సమయంలో

పాకిస్థాన్‌లో రాజకీయ అస్థిరత, శ్రీలంకలో సంక్షోభం, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, అటు రష్యా-ఉక్రెయిన్ యుద్దం.. వంటి పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీకి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టారు.

  • చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి ఎంపికైన తొలి అధికారి జనరల్ పాండే.
  • జనరల్ పాండే భారత సైన్యానికి 29వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌.
  • నేషనల్ డిఫెన్స్ అకాడమీలో పాండే చదువుకున్నారు.
  • బ్రిటన్‌లోని కంబెర్లీ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు.
  • హయ్యర్ కమాండ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులు చేశారు.
  • 1982 డిసెంబరులో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ (బాంబే సాపర్స్)లో చేరారు.
  • 39 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో విభిన్న వాతావరణాల్లో, వైవిధ్యభరితమైన  కార్యకలాపాలకు పాండే నాయకత్వం వహించారు. 
 

Also Read: CWC Meeting: పార్టీ మీకు చాలా ఇచ్చింది- ఇది తిరిగి ఇవ్వాల్సిన టైమ్: సోనియా సందేశం

Also Read: Sedition Law: రాజద్రోహం చట్టంపై కేంద్రం యూటర్న్- సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు!

Published at: 09 May 2022 11:18 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.