New Delhi Railway Station Accident: మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తులతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ ఒక్కసారిగా జనసంద్రంగా మారింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో తొక్కిసలాట జరిగింది. చాలా మంది భక్తులకు ఊపిరి ఆడలేదు. ఈ ఘటనలో 18 మంది భక్తులు మృతిచెందగా, మరో 25 మందికి పైగా గాయపడ్డారని అధికారులు. ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యంగా రావడంతో ఈ దుర్ఘటన జరిగింది. 


న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 13,14పై ప్రమాదం జరిగింది. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో జనాలకు ఊపిరి ఆడలేదు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. చాలా మంది స్పృహకోల్పోయారు. మరికొందరు కిందపడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 


ఢిల్లీ రైల్వే పోలీస్ యూనిట్ మాత్రం తొక్కిసలాట జరగలేదని చెబుతున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే వారితో ప్లాట్‌ఫామ్స్ నిండిపోయాయని అంటున్నారు. రాత్రి 8 గంటలకు న్యూఢిల్లీ స్టేషన్‌కు రావాల్సిన ట్రైన్స్ రాక ఆలస్యమవ్వడంతోనే ఘటన జరిగిందని అంటున్నారు. ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యంగా రావడంతో ప్లాట్‌ఫారమ్‌పై రద్దీ పెరిగింది. ఈ రద్దీలో 45 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 18 మంది మృతిచెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.  






రద్దీ పెరిగి గందరగోళం ఏర్పడటంతో వెంటనే రైళ్లను ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చారు. కుంభమేళాకు వెళ్లవలసిన వారిని ఎక్కించి రద్దీని నియంత్రించారు. రద్దీ కారణంగా మరిన్ని రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు రైల్వే శాఖ పేర్కొంది. 


రైల్వే స్టేషన్‌లో "తొక్కిసలాట లాంటి పరిస్థితి" ఉందని తమకు ఫిర్యాదులు అందాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ తెలిపింది. ఢిల్లీ పోలీసులు 14, 16 ప్లాట్‌ఫారమ్‌ల్లో తొక్కిసలాట జరిగిందని తెలిపారు. తొక్కిసలాట జరగలేదని రైల్వే శాఖ ప్రకటించింది. 


సోషల్ మీడియా వినియోగదారులు షేర్ చేసిన ఫుటేజ్‌ల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి ప్లాట్‌ఫారమ్ వద్ద జనాలు తోసుకొని వచ్చారని తెలుస్తోంది. రెండు రైళ్లు షెడ్యూల్ సమయం కంటే ఆలస్యంగా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చాయి, ఇందులోకి ఎక్కేందుకు జనాలు పరుగులు పెట్టారు. అదే ప్రమాదానికి కారణమని సమాచారం. 






తన తల్లికి కన్ఫర్మ్ టికెట్ ఉందని, కానీ జనాలు చూస్తే "అడుగు ముందుకు వేయడానికి ఒక్క అంగుళం కూడా లేదు" అని ABP న్యూస్‌తో మాట్లాడిన ఒక ప్రయాణీకుడు చెప్పాడు. స్టేషన్ లోపల ఈ ఘటన జరిగిందని, ప్రాణనష్టం జరిగి ఉంటుందనే భయంగా ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణికులను స్టేషన్‌లోకి వెళ్లనీయలేదు. దీని కారణంగా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణించాల్సిన ఇబ్బంది పడ్డారు. 


మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అన్ని రైళ్లలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటోంది. ప్రతిరోజూ లక్షల మంది సంగమంలో స్నానం చేస్తున్నారు. ప్రస్తుతానికి అధికారిక లెక్కల ప్రకారం శనివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 1.36 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 52.83 కోట్ల మంది భక్తులు సంగంలో స్నానాలు ఆచరించారు.


Also Read: ఢిల్లీ ఆప్‌లో సంక్షోభం- ప్రెషర్‌ కుక్కర్‌లో పంజాబ్‌-కేజ్రీవాల్‌కు షాక్‌ మీద షాక్‌!