Aam Aadmi Party Latest News In Telugu: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ మధ్యే ముగిశాయి. ఇంకా కొత్త ప్రభుత్వం పదవీ బాధ్యతలు తీసుకోలేదు. ప్రస్తుతానికి ఆపధర్మ ప్రభుత్వమే కొనసాగుతోంది. అప్పుడే ఆమ్‌ఆద్మీ పార్టీకి కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలే ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు జరుగుతున్నాయి. మరోవైపు పంజాబ్‌లో కూడా ఆప్ ప్రభుత్వానికి కష్టాలు తప్పేలా లేవు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత, ఆమ్ ఆద్మీ పార్టీకి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి)లో కూడా పెద్ద షాక్ తగిలింది. శనివారం (ఫిబ్రవరి 15) ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. దీంతో ఎంసీడీని కూడా బీజేపీ కైవశం చేసుకునేందుకు మార్గం సుగమం అయింది.
ఆండ్రూస్ గంజ్ నుంచి అనితా బసోయా, ఆర్కె పురం నుంచి ధరమ్‌వీర్, చప్రానా నుంచి నిఖిల్ ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టి బిజెపిలో చేరారు. ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ సభ్యత్వం ఇచ్చారు.
ఆప్‌లో కొత్త సంక్షోభం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, ఎంసీడీలో ఆప్ సమస్యలు పెరిగాయి. ఇప్పటికే చాలా మంది కౌన్సిలర్లు ఆ పార్టీపై కోపంగా ఉన్నారు, ఇప్పుడు ముగ్గురు కౌన్సిలర్లు బిజెపిలో చేరడం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా బిజెపి పట్టు బలపడుతోందని స్పష్టమవుతోంది.
MCDలో అధికార మార్పు జరుగుతుందా?
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి మేయర్ పదవిని కైవసం చేసుకుంది, కానీ ఇప్పుడు ఆ పార్టీ కౌన్సిలర్లు విభేదించి వెళ్లిపోయి బీజేపీలో చేరుతున్నారు. ఇలా మరికొందరు కౌన్సిలర్లు బిజెపిలో చేరితే ఎంసీడీలో అధికార మార్పు జరిగే అవకాశం ఉంది. ఎంసీడీలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆప్ ప్రభుత్వం అవినీతి పాలన చేసిందని తరచూ బిజెపి ఆరోపిస్తోంది. మద్యం పాలసీ కుంభకోణం నుంచి మున్సిపల్ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగం వరకు అన్నింటా దోచుకుందని బిజెపి దాడి చేస్తోంది. ఇప్పుడు ఆప్ కౌన్సిలర్లు బిజెపిలో చేరుతున్నందున ఎంసీడీలో కూడా పెద్ద తిరుగుబాటు ఖాయంగా కనిపిస్తుంది.
Also Read: బిఎస్‌ఎన్‌ఎల్‌కు టైం వచ్చింది! 17 ఏళ్ల తర్వాత తొలిసారిగా లాభాలు
మరోవైపు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ సంక్షోభం ప్రభావం పంజాబ్‌పై పడుతుందనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పంజాబ్ ప్రభుత్వంలో చీలిక వస్తుందని అంటున్నారు. అందుకే పంజాబ్‌లో పార్టీని కాపాడుకునే కసరత్తును కేజ్రీవాల్ ప్రారంభించారని చెబుతున్నారు. ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడారు. అంతే కాకుండా అక్కడ ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు.
పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం కూలిపోవడానికి కాంగ్రెస్ కారణమవుతుందని కేజ్రీవాల్ అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఓడిపోయిన వెంటనే పంజాబ్‌లో ప్రతిపక్ష నేత అయిన కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన కామెంట్స్ చేశారు. పంజాబ్‌లో కనీసం 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు.
ఢిల్లీలో 22 సీట్లకు పరిమితమైన తీరు పంజాబ్ ఎమ్మెల్యేలను భయపెడుతోంది. 2027లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ మాదిరిగానే, పంజాబ్‌లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవశం చేసుకుంది. అయితే ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి రానప్పటికీ ఆప్‌ను ముఖ్యంగా కేజ్రీవాల్‌ను ఓడించింది. అందుకే ఇప్పుడు పోయిన చోటే వెతుక్కునే పనిలో ఉంది కాంగ్రెస్.
Also Read: శారీరక సంబంధం లేదని ప్రేమ వివాహేతర సంబంధం కాదు - మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు