ఆదివారం కన్నుమూసిన లతామంగేష్కర్‌కు డెయిరీ బ్రాండ్ అమూల్ ఘనమైన నివాళి అర్పించింది. ట్విట్టర్‌లో ప్రముఖ గాయని కొత్త కార్టూన్‌ను షేర్ చేసింది.
ఈ కార్టూన్‌లో ప్రముఖ గాయని మూడు చిత్రాలు ఉన్నాయి. ఒకదాంట్లో ఆమె మైక్ స్టాండ్ వద్ద పాడుతూ ఉంది. ఇంకొక చిత్రంలో లతామంగేష్కర్ చేతుల్లో వీణ ఉంది ఆమె పాడుతోంది. మూడోది చిన్నపాప ఆ చిత్రాలను చూస్తూ ఉంది.
నైటింగేల్ ఆఫ్ ఇండియాను అమూల్ గౌరవిస్తూ 1966 కల్ట్ క్లాసిక్ 'మేరా సాయా' నుంచి ఆమె చిరస్మరణీయమైన 'తూ జహాన్ జహాన్ చ్లేగా మేరా సయా సాత్ హోగా'(నువ్వు ఎక్కడికి వెళ్లినా నా నీడ నీ వెంటే ఉంటుంది) పాటను ప్రస్తావిస్తూ "హమ్ జహాన్ జహాన్ చలేంగే అప్కా సాయా సాత్ హోగా" (ఎక్కడకు వెళ్లినా నీ జ్ఞాపకాలు నీడలా మా తోడుగా ఉంటాయి )అని రాసింది.
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు ఆదివారం ముంబైలోని శివాజీ పార్క్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని స్టేడియానికి తీసుకువెళ్లిన వాహనం పూర్తిగా తెల్లటి పూలతో అలంకరించారు. వానానికి లతా మంగేష్కర్ ఫోటోను కూడా పెట్టారు. ఆమె పార్థివ దేహం ఉంచిన శవపేటికను కూడా త్రివర్ణ పతాకంతో చుట్టారు. ఆమె అంతిమయాత్ర వెంట సైన్యం నడిచింది.
అంతిమ సంస్కారాల కోసం ప్రధాని నరేంద్రమోడీ వచ్చి నివాళులర్పించారు.
ఆ చిరునవ్వు ఎప్పటికీ మర్చిపోలేను: డాక్టర్ సమ్దానీ
గత మూడేళ్లుగా ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ సమ్దానీ మాట్లాడుతూ, "లతాజీ ఆరోగ్యం క్షీణించినప్పుడల్లా నేను ఆమెకు చికిత్స చేశాను, కానీ ఈసారి ఆమె పరిస్థితి రోజురోజుకు క్షీణించింది. మేము మా ప్రయత్నాలు కొనసాగించినప్పటికీ ఆమెను రక్షించలేకపోయాము.
"అందరినీ సమానంగా చూసుకోవాలి" లతామంగేష్కర్ ఎప్పుడూ చెప్పేవారని డాక్టర్ చెప్పారు. "ఆమె తనకు అవసరమైన చికిత్స తీసుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉండేవాళ్లు దానిని ఎప్పుడూ ఆమె వాయిదా వేసుకోలేదు." అని ఆయన చెప్పారు.
"ఆమె చివరి క్షణాల్లో కూడా ఆమె ముఖంలో చిరునవ్వు ఉంది. గత కొన్నేళ్లుగా ఆమె ఆరోగ్యం బాగా లేదు. ఆమె ఎవరితోనూ ఎక్కువగా కలవలేకపోయారు. అయినా ఆ చిరునవ్వు చెరగలేదు. నా జీవితాంతం ఆమె చిరునవ్వును గుర్తుంచుకుంటాను. " అన్నారు డాక్టర్ సమ్దానీ