Amit Shah on Pakistan occupied Kashmir: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో భాగమని అన్నారు. మరోసారి ప్రధానిగా మోదీ అధికారంలోకి రాగానే ఈసారి పాక్ ఆక్రమిత కశ్మీర్ ను కూడా వెనక్కి తీసేసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బంగాల్‌లోని సిరాంపూర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇంకా కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు ముందు, తర్వాత ఉన్న పరిస్థితులను గురించి ప్రస్తావించారు. 2019 లో తాము తీసుకున్న ఆ నిర్ణయం చాలా సాహసోపేతం అని అన్నారు. దానివల్లే ఇప్పుడు కశ్మీర్ లో శాంతి భద్రతలు కనిపిస్తున్నాయని.. ఇంకా పాకిస్థాన్ ఆధీనంలో ఉన్న పీఓకేలో ఉద్రిక్తతలు, ఘర్షణలు చెలరేగుతున్నాయని అన్నారు. 


‘‘పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో భాగం అవునా కాదా? అందరూ గట్టిగా చెప్పండి. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో భాగం. దాన్ని మేం తిరిగి భారత్ లో కలుపుతాం’’ అని అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.


పీఓకేని స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్‌ను కాంగ్రెస్ సపోర్ట్ చేయడం లేదు. కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్ వంటి కాంగ్రెస్ నాయకులు తమ వద్ద అణుబాంబు ఉన్నందున అలా చేయవద్దని చెప్పారు. కానీ, ఈ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌లో భాగమని, దాన్ని తిరిగి మన ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతున్నాను. మణిశంకర్ అయ్యర్, ఫరూక్ అబ్దుల్లాలు పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాట్లాడకూడదని పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని మమ్మల్ని భయపెట్టేవారు. రాహుల్ బాబా, మమతా దీదీ, మీరు ఎంత భయపడినా పాక్ ఆక్రమిత కశ్మీర్ మనది. దాన్ని వెనక్కి తీసుకుంటాం’’ అని అమిత్ షా అన్నారు.