Asaduddin Owaisi Against To Womens Reservation Bill:


ఢిల్లీఫ లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరగగా 454 మంది అనుకూల ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం తెలిసిందే. దాంతో లోక్ సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు బుధవారం ఆమోదం పొందింది. ఓటింగ్ అనంతరం ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ఈబీసీలు యాభై శాతం జనాభా ఉన్నా లోక్ సభలో కేవలం 22 శాతం మంది ఎంపీలు ఉన్నారని చెప్పారు. ముస్లింల విషయానికొస్తే నాలుగు లోక్ సభలలో ఒక్క ముస్లిం మహిళా ఎంపీ కూడా లేరని గుర్తుచేశారు. 1957, 62, 91లో ముస్లిం మహిళలకు లోక్ సభలో ప్రాతినిథ్యం దొరకలేదన్నారు. ఈ కారణంతో ముస్లింలకు, ఈబీసీలకు సైతం మహిళా రిజర్వేషన్లో అవకాశం కల్పించాలని పార్లమెంట్ లో తమ వాదనను వినిపించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు.


దేశ జనాభాలో 7 శాతం ముస్లిం మహిళలు ఉన్నారని, కానీ కానీ వారి ప్రాతినిథ్యం 0.7 శాతంగా ఉందని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఓబీసీ, ముస్లింలకు సైత ప్రాతినిథ్యం కల్పించాలని కోరుతూ నేటి ఓటింగ్ లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పష్టం చేశారు. ఓబీసీలు ఎంతో మంది ఉన్నా పార్లమెంట్ లో వారి ప్రాతినిథ్యం కనిపించడం లేదని, ఇకనైనా మార్పు వచ్చి బిల్లులో మార్పులు చేయాలని కోరారు. మహిళా కోటా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇద్దరు ఎంఐఎం సభ్యులే. ఒకరు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్ ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్.






మాజీ ప్రధాని హెచ్.డి దేవేగౌడ హయాం నుంచి మన్మోహన్ హయాం వరకు మొత్తం నాలుగు పర్యాయాలు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారు. తాజాగా 5వ సారి లోక్ సభలో మహిళా కోటా బిల్లు ప్రవేశపెట్టగా భారీ మెజార్టీతో ఏకపక్షంగా ఆమోదం పొందింది. కొత్త పార్లమెంట్ లో ఆమోదం పొందిన తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచింది. లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లు తదుపరి రాజ్యసభకు వెళ్తుంది. రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న బిల్లు అక్కడ పాసైతే రాష్ట్రపతికి వద్దకు వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బిల్లు చట్టంగా మారి మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ లభించనుంది. అయితే బిల్లు చట్టంగా మారినా 2024 ఎన్నికల్లో మహిళా కోటా అమలు సాధ్యం కాదు. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్ విభజన జరిగి.. 2029 ఎన్నికల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ సాధ్యపడుతుంది.