AIADMK Tussle: మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తమిళనాడు చెన్నైలోని అన్నా డీఎంకే ప్రధాన కార్యాలయ తాళాలను పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి అందించాలని కోర్టు ఆదేశించింది.






ఆయనకే ఇచ్చేయండి


ఇటీవల పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలకు చెందిన కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయానికి తాళం వేసి సీలు వేశారు. ఈ మేరకు దక్షిణ చెన్నై రెవెన్యూ డివిజనల్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.


అయితే ఈ ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు బుధవారం రద్దు చేసింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి కార్యాలయ తాళాలు అందజేయాలని ఆదేశించారు.


OPS ఔట్


ఏడీఎంకే పార్టీ నుంచి సీనియర్ నేత పన్నీర్‌సెల్వంను బహిష్కరిస్తూ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు.


పన్నీర్‌సెల్వం ప్రాథమిక సభ్యత్వం రద్దు చేయడం సహా కోశాధికారి పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. ఆయన అనుచరులను కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అన్నాడీఎంకే స్పష్టం చేసింది.


కీలక తీర్మానాలు


ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరిస్తూ పార్టీ సర్వసభ్య మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నాలుగు నెలల తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించాలని పళనిస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.


పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉన్నవారు ఓటేసి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నారు. అలానే పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిని.. జనరల్ సెక్రటరీ ఎన్నుకునేలా మరో తీర్మానానికి ఆమోదం తెలిపారు. అప్పటివరకు పళనిస్వామి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.


Also Read: Maharashtra Political News: ఠాక్రేకు సుప్రీంలో నిరాశ- శిందే వర్గానికి గడువు ఇచ్చిన కోర్టు


Also Read: Smriti Irani Attacks on Rahul Gandhi: రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ ఫైర్- ప్రశ్నించే దమ్ములేదని విమర్శ