AIADMK Breaks With BJP: బీజేపీతో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకుంది. ఇకపై ఎన్డీఏ భాగస్వామిగా ఉండబోవడం లేదని ప్రకటించింది. తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన పార్టీ కీలక నేతల సమావేశం తర్వాత ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రవిడ దిగ్గజం సీఎన్ అన్నాదురైపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది.


సోమవారం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో.. బీజేపీతో విడిపోవాలని AIADMK ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి తెలిపారు. ఈ రోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగదెంపపులు చేసుకుంటోందనని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం గత ఏడాది కాలంగా మా మాజీ నాయకులు, మా ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ పై, అలాగే పార్టీ కార్యకర్తల గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మునుసామి చెప్పారు. బీజేపీతో పొత్తు తెగదెంపుల సందర్భంగా పార్టీ కార్యాలయం బయట పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. 


1956 లో మదురైలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నాదురై హిందూ మతాన్ని అవమానించారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం నెలకొంది.