ఢిల్లీలోని కుతుబ్ మినార్ చుట్టూ రోజుకో వివాదం చెలరేగుతుంది. ఇప్పటికే అక్కడ ప్రార్థనలపై లొల్లి జరుగుతుంది. ఇందులో హిందూ, జైన ఆలయాలున్నాయని.. అక్కడ ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు కోర్టును కోరారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుండగానే.. అసలు కుతుబ్ మినార్ తమదేనంటూ కొందరు రాజవంశీయులు న్యాయస్థానం తలుపుతట్టారు. తమకు ఆ నిర్మాణాన్ని అప్పగించాలని కోరారు.

   


మేం ఆగ్రా రాజకుటుంబ వారసులం


కున్వర్ మహేంద్ర ధ్వజ్ ప్రసాద్ సింగ్.. కుతుబ్ మినార్ కోసం కోర్టుమెట్లు ఎక్కారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. తను బెస్వాన్ కుటుంబ సభ్యుడు. రాజా రోహిణి రామన్ ధావజ్ ప్రసాద్ సింగ్ సహజ వారసుడు. 1695లో మరణించిన రాజా నంద్ రామ్ వంశీయుడు.  మీరట్ నుండి ఆగ్రా వరకు విస్తరించి ఉన్న విస్తారమైన భూభాగానికి సంబంధించి పలు నిర్మాణాలు తమవేనని.. వాటిపై తమకు హక్కును కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.


సెప్టెంబరు 13న మరోసారి విచారణ


ప్రసాద్ సింగ్ వాదన ప్రకారం, నంద్ రామ్ చక్రవర్తి ఔరంగజేబుకు తన సింహాసనాన్ని అప్పగించాడు.  అందుకు ప్రతిఫలంగా ఖిద్మత్ జమీందారీగా ఉన్నాడు. జోర్, తోచిగఢ్ ఆదాయాన్ని స్వీకరించేవాడు. 1947లో మరో కుటుంబ సభ్యుడు రాజా రోహిణి రామన్ ధావజ్ ప్రసాద్ సింగ్ నాయకత్వంలో మరిన్నిమార్పులు జరిగాయి. అయితే, 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, భారత ప్రభుత్వం ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని దరఖాస్తుదారుడు వాదించారు. అయితే ఈ కేసు విచారణను సెప్టెంబర్ 13న మరోసారి చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.


ఇన్నేండ్లు ఎందుకు మాట్లాడలేదు?


అటు రాజవంశీయుల వాదనను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తప్పుబట్టింది. అనేక రాష్ట్రాల్లోని విశాలమైన ప్రాంతాలపై సింగ్ హక్కులను క్లెయిమ్ చేస్తున్నాడని.. ఈ విషయం గురించి గత 150 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. ఈ ఆస్తులు తమవేనని ఏ కోర్టు ముందు ఈ సమస్యను ఎందుకు లేవనెత్తలేదో చెప్పాలన్నది. ఏ ఆధారం లేకుండా వారు కోర్టు ముందుకు వచ్చారని వెల్లడించింది.  సుల్తానా బేగం అనే మహిళ, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ యొక్క మునిమనవరాలిగా చెప్పుకోవడం ద్వారా ఎర్రకోటపై తన యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రస్తవించింది. అయితే, న్యాయస్థానం పూర్తిగా ఆలస్యం ఆధారంగా వాదనను కొట్టివేసింది.


తక్షణ ఆదేశాలు ఇవ్వలేం..


అటు కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌ లో వందల సంవత్సరాల క్రితం కూల్చివేసిన హిందూ, జైన దేవాలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ పై ఢిల్లీ  సాకేత్ కోర్టు విచారణ జరిపింది. కాంప్లెక్స్‌లో హిందూ దేవతలను పూజించాలనే పిటిషనర్ డిమాండ్‌పై న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.  దేవత ఎటువంటి పూజలు లేకుండా 800 సంవత్సరాలు ఉందని.. వాళ్ళను అలాగా బతకనివ్వాలని వ్యాఖ్యానించారు.   దీనిపై స్పందించిన పిటిషనర్ తరఫు న్యాయవాది.. ఒక దేవత నాశనం చేయబడితే.. ఆ దేవత తన దైవత్వాన్ని కోల్పోదని చెప్పారు.  దేవత బ్రతికితేనే పూజించే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు చెప్పిందని వెల్లడించారు.  ఈ వాదనను సాకేత్ కోర్టు ససమర్థించలేదు. తక్షణ ఆదేశాలకు నిరాకరించింది.