Pakistan based terror :   కశ్మీర్ సరిహద్దులు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. చొరబడేందుకు ప్రయత్నించే టెర్రరిస్టులు ఎప్పుడూ ఉంటారు. అలాంటి కొంత మంది టెర్రరిస్టులు  చొరబడేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆ వీడియోను సైనికదళాలు విడుదల చేశారు. భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాక్‌ ఉగ్రవాదులు మైన్‌ఫీల్డ్‌లోకి ప్రవేశించి పేలుడులో మరణించారు. జమ్ముకశ్మీర్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద ఈ సంఘటన జరిగింది. 


ఆగస్టు 22న ఎల్‌వోసీ నుంచి భారత్‌లోకి వచ్చిన పాక్ టెర్రరిస్టులు ! 


ఆగస్ట్ 22న నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖకు 150 మీటర్ల దూరంలో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని భారత ఆర్మీ గుర్తించింది. అయితే ఆ ఉగ్రవాదులు అక్కడి మైన్‌ఫీల్డ్‌లోకి ప్రవేశించి ల్యాండ్‌ మైన్‌పై అడుగుపెట్టారు. దీంతో అది పేలడంతో వారిద్దరూ మరణించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.కాగా, పేలుడు తర్వాత మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను డ్రోన్‌ ద్వారా గుర్తించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. 


ల్యాండ్ మైన్ పై కాలు పెట్టి .. తీయడంతో  పేలుడు - తునా తునకలైన టెర్రరిస్టులు !


సోమవారం, మంగళవారం మధ్య రాత్రి సమయంలో నౌషేరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద భారత్‌ వైపు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. పేలుడులో మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియోను భారత ఆర్మీ విడుదల చేసింది. ఇద్దరు పాక్‌ ఉగ్రవాదులు మైన్‌ఫీల్డ్‌లోకి ప్రవేశించిన తర్వాత పేలుడు సంభవించింది. అనంతరం ఉగ్రవాదులు మరణించిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి.





వీడియో విడుదల చేసిన ఆర్మీ వర్గాలు  !


జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. సరిహద్దుల అవతలి నుంచి ఇటు వైపునకు టెర్రరిస్టులను పంపడం కూడా పెరిగింది. అయితే అలాంటి వారు రాకుండా సైన్యం అన్ని రకాల జాగ్రత్తలుతీసుకుంటోంది. ఈ క్రమంలో ల్యాండ్ మైన్లను కూడా అమర్చారు. ఈ విషయం తెలియక చాలా మంది అటు వైపు వస్తున్నారు. అలా వచ్చిన వారికి.. ఆయుధాలను డ్రోన్ల ద్వారా పంపుతున్నారు. ఇలాంటి డ్రోన్లను కూడా  చాలా సార్లు ఆర్మీ ధ్వంసం చేసింది.  . అయినా  పాకిస్తాన్ వైపు నుంచి  చొరబాట్లు మాత్రం ఆగడం లేదు.