సీ ఓటర్ సర్వేలో ఏం తేలిందంటే..
పార్టీలు, సిద్ధాంతాలు వేరు కావచ్చు. కానీ...అందరి టార్గెట్ మాత్రం 2024 ఎన్నికలే. గత సార్వత్రిక ఎన్నికల్లో "వార్ వన్‌సైడ్" అయిపో ఎన్‌డీఏ మరోసారి అధికారం చేపట్టింది. కానీ..ఈ సారి మోడీని ఢీ కొట్టి బలమైన పోటీ ఇవ్వాలని చూస్తున్న నేతల జాబితా పెద్దగానే ఉంది. అటు పశ్చిమబెంగాల్ సీం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ పోటీలో నిలిచేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీదీ..ప్రతిపక్ష పార్టీలను ఒకతాటిపైకి తీసుకొచ్చే పనిలో పడిపోయారు. ఇటు కేసీఆర్ కూడా ఇంచుమించు అదే చేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్...నిన్న మొన్నటి వరకూ ప్రధాని మోదీ విమర్శలు చేసినా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వివాదం తెరపైకి వచ్చిన తరవాత విమర్శల పదును పెంచారు. రోజూ ఏదో విధంగా ఆయనను టార్గెట్ చేస్తూ...కేంద్రం తమను కావాలనే టార్గెట్ చేస్తోందని అసహనం ప్రదర్శిస్తున్నారు. ఈ అన్ని పరిణామాల మధ్య ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో భాజపా వర్సెస్ ఆప్ ఫైట్ తప్పదని అన్నారు.
ఎంత మంది అవును అని చెప్పారు..?
ఇటీవల పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకున్న ఊపులో ఉన్న ఆప్...అదే జోరుతో 2024 ఎన్నికల్లోనూ విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే మోదీ వర్సెస్ కేజ్రీవాల్ ఫైట్ పైనా అందరి దృష్టి నెలకొంది. మరి ప్రధాని మోదీ చరిష్మాను ఢీకొట్టే సామర్థ్యం కేజ్రీవాల్‌కు ఉందా..?
ఈ విషయంపై ABP News కోసం C-Voter ఓ Survey నిర్వహించింది. ఈ సర్వేలో ఇంట్రెస్టింగ్ ఫలితాలు వెలువడ్డాయి. 2024లో జరిగే ఎన్నికల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్...ప్రధాని మోదీని ఢీకొట్టగలరా అన్న ప్రశ్నపై దాదాపు 2,102 మందిపై సర్వే చేసింది C-Voter. వీరిలో దాదాపు 44% మంది "అవును" అని సమాధానమివ్వగా...56% మంది "కాదు" అని బదులిచ్చారు. మొత్తంగా చూస్తే ఈ సర్వేలో అరవింద్ కేజ్రీవాల్ వెనకబడే ఉన్నారు.
మోడల్ వర్సెస్ మోడల్..
కేజ్రీవాల్, ప్రధాని మోదీని టార్గెట్ చేశారనటానికి గుజరాత్ పర్యటనే సాక్ష్యం. ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ రగడ నడుస్తున్న నేపథ్యంలోనే గుజరాత్‌కు రెండ్రోజుల పర్యటన కోసం వెళ్లారు కేజ్రీవాల్, సిసోడియా. గుజరాత్ ప్రజలు భాజపాను 27 ఏళ్లుగా భరిస్తున్నారని, వాళ్ల అరాచక పాలనలో వాళ్లు మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. తమ పార్టీని గెలిపిస్తే...మెరుగైన విద్య,వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గుజరాతీలందరికీ ఉచిత వైద్యం అందిస్తామనీ చెప్పారు. "ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌ల తరహాలో గుజరాత్‌లోనూ పట్టణాలు, గ్రామాల్లో హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తాం. ఉన్న ప్రభుత్వాసుపత్రులను బాగు చేయటమే కాకుండా.. కొత్త ఆసుపత్రులనూ అందుబాటులోకి తీసుకొస్తాం" అని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని బస్ డ్రైవర్లు, కండక్టర్లు...ఆప్‌నకు ఓటు వేయాలని ప్రయాణికులకు చెప్పాల్సిందిగా కోరారు. ఢిల్లీ తరహాలోనే గుజరాత్‌లోనూ మెరుగైన పాఠశాలలు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మొత్తంగా కేజ్రీవాల్ చెప్పిందేంటంటే.."ఢిల్లీ మోడల్‌ను" గుజరాత్‌లోనూ అమలు చేస్తామని. కానీ...ఇప్పటికే భాజపా "గుజరాత్ మోడల్" అంటూ తెగ ప్రచారం చేసుకుంటోంది. దేశంలో ఏ రాష్ట్ర పురోగతికైనా "గుజరాత్ మోడల్"ను ఆదర్శంగా తీసుకోక తప్పదన్న స్థాయిలో క్లెయిమ్ చేసుకుంటోంది. ఇలాంటి చోట...ఢిల్లీ మోడల్‌ను అమలు చేయటం సాధ్యమేనా..? గుజరాతీలు దీన్ని అంగీకరిస్తారా అన్నదే
ఆసక్తికరంగా మారింది.
Also Read: KTR : కేంద్రంలో ఉన్నది మోడీ కాదు ఏడీ ప్రభుత్వం - ఏడీ అంటే కేటీఆర్ చెప్పిన అర్థం ఏమిటంటే ?
Also Read: CBI Raid: తేజస్వీ యాదవ్ మాల్‌లో సీబీఐ సోదాలు, అసెంబ్లీ స్పీకర్ రాజీనామా - బిహార్‌లో ఏం జరుగుతోంది?