CP Women’s Quota Bill in Parliament: మహిళా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంపై మహిళా ఎంపీలు సంబరాలు చేసుకున్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల చివరి రోజు అర్ధరాత్రి సమయంలో కొత్త పార్లమెంట్ భవనం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మహిళా ఎంపీలతో ఫొటోలు దిగారు. మహిళా ఎంపీలతో నవ్వుతూ, కబుర్లు చెబుతూ ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీకి భారీ పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకతీతంగా మహిళలు ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు.






ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. భారత దేశ ప్రజాస్వామిక ప్రయాణంలో మహిళా బిల్లు ఆమోదం నిర్ణయాత్మక ఘట్టంగా అభివర్ణించారు. 140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు తెలిపారు. నారీ శక్తి వందన్ అధినియమ్‌కు ఓటు వేసిన రాజ్యసభ ఎంపీలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇటువంటి ఏకగ్రీవ మద్దతు నిజంగా హర్షించదగినదన్నారు.


పార్లమెంటులో నారీ శక్తి వందన్ అధినియమ్ ఆమోదించడంతో భారతదేశంలోని మహిళలకు బలమైన ప్రాతినిధ్యం, సాధికారత కల్పించే సరికొత్త యుగానికి నాంది పలికినట్లు ప్రధాని  చెప్పారు. ఇది కేవలం శాసనం కాదని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి కృషి చేసిన ఎంతో మంది మహిళలకు నివాళి అన్నారు. వారి సంకల్పం, దృఢత్వం సహకారంతో భారతదేశం సుసంపన్నమైందని ప్రధాని పేర్కొన్నారు. నేడు మనం జరుపుకుంటున్న సంబరాలు, మన దేశంలోని మహిళలందరి బలం, ధైర్యం, లొంగని స్ఫూర్తిని గుర్తు చేస్తాయన్నారు. ఈ చారిత్రాత్మక అడుగు వారి గొంతులను మరింత ప్రభావవంతంగా వినిపించేలా చేస్తుందన్నారు. 


చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోద ముద్ర వేసింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పార్టీలకతీతంగా సభ్యులందరూ ఈ బిల్లుకు మద్దతుగా నిలిచారు. మొత్తం 215 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా.. బిల్లును ఒక్కరూ కూడా వ్యతిరేకించకపోవడం విశేషం. బుధవారం లోక్‌సభలో పార్టీలకతీతంగా 454 మంది ఎంపీలు బిల్లుకు మద్దతుగా నిలిచారు. ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఉభయసభల్లోనూ ఈ బిల్లుకు ఆమోదముద్ర పడింది. దీని తర్వాత సుమారు దేశంలోని సగం అసెంబ్లీలు కూడా బిల్లుకు మద్దతు తెలపాల్సి ఉంది.


ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లు జనగణన, డీలిమిటేషన్‌ ప్రక్రియ అనంతరం కార్యరూపం దాల్చే అవకాశంఉంది. లోక్‌సభ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఈ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. చట్ట ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన 2026 తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. 


కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లను ఇప్పుడే అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. జనాభా లెక్కలు పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని పేర్కొన్నారు. రాజ్యసభలో ఉన్న ఎన్నికల విధానం కారణంగా.. ఈ సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని వెల్లడించారు. అయితే తక్షణమే తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయాలని, ఇతర వెనుకబడిన తరగతుల మహిళలకు రిజర్వేషన్లలో వాటా కల్పించాలని డిమాండ్ చేశారు.