మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజసింగ్‌ చౌహాన్‌ ఈరోజు ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి  'ఏకాత్మా కి ప్రతిమ' లేదా 'స్టాచ్యూ ఆఫ్‌ వన్‌నెస్‌' (Statue of Oneness) అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఇది ఆదిశంకరాచార్యుల వారి వారసత్వానికి, వారి బోధనలకు స్మారక నివాళిగా నిలుస్తుందని చౌహాన్‌ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ విగ్రహం సెప్టెంబరు 18వ తేదీనే ఆవిష్కరించాల్సి ఉండగా ఆ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా సెప్టెంబరు 21వ తేదీన ఆవిష్కరణ చేశారు. 


విగ్రహావిష్కరణ సందర్భంగా శివరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. "స్టాచ్యూ ఆఫ్‌ వన్‌నెస్‌ ప్రపంచానికి శాంతి సందేశం అందిస్తుంది. అంతా భగవంతుడి ఆశీస్సుల వల్లే జరుగుతుంది. భారతదేశ విజ్ఞానం, సంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. భరత వర్షంగా పిలిచే ఈ భూమిని ఏకీకృతం చేయడానికి శంకరాచార్యులు కృషి చేశారు. అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా వ్యూహాత్మకంగా నాలుగు ఆధ్యాత్మిక మఠాలను స్థాపించడంలో ఆయన పాత్ర కీలకం" అని శంకరాచార్యుల వారి గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌ పట్టణంలో ఆదిశంకరాచార్యుల విగ్రహంతో పాటు మ్యూజియం నిర్మించేందుకు భారతీయ జనతా పార్టీ రూ.2,141,85కోట్ల రూపాయలు కేటాయించింది.


ఖాండ్వా జిల్లాలో నర్మదా నదికి అభిముఖంగా ఉన్న సుందరమైన మాంధాత కొండపై ఈ విగ్రహ నిర్మాణం చేశారు. ఆచార్య శంకర సంస్కృతిక ఏక్తా న్యాస్‌ మార్గదర్శకత్వంలో మధ్యప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఆదిశంకరాచార్య తత్వాన్ని చాటి చెప్పడంతో పాటు ఏకత్వం భావనను నొక్కి చెప్పేందుకు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్‌ వన్‌నెస్‌ అని పేరు పెట్టారు.


ఈ ప్రాజెక్టు మానేజింగ్‌ ప్రిన్సిపల్ దీక్షు కుక్రేజా మాట్లాడుతూ..'ఇది చాలా అద్భుతమైన కట్టడం. ఆదిశంకరాచార్యుల వారి జీవితాన్ని, తత్వాన్ని గౌరవించేలా దీనిని రూపొందించాం. బ్రహ్మసూత్ర భాష్యపై అద్భుతమైన వ్యాఖ్యానాలు చెప్పిన గొప్ప సాధువుకి ఇది గొప్న నివాళి. ఈ సాంస్కృతిక ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ వసుదైక కుటుంబం ఆలోచనలో భాగం. ఈ 108 అడుగుల ఎత్తైన విగ్రహంతో మధ్యప్రదేశ్‌ అన్ని మతాలకు, సాంస్కృతికతకు ఆధ్యాత్మిక కేంద్రంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది' అని తెలిపారు.


ఈ ప్రాజెక్టును 2018లో ప్రారంభించారు. తొలుత షోలాపూర్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు వాసుదేవ్‌ కామత్‌ ఆదిశంకరాచార్యుల వారి విగ్రహానికి చిత్రపటాన్ని రూపొందించారు. అనంతరం ఏకాత్మ యాత్ర పేరుతో భారీ బహిరంగ ర్యాలీలు, ఊరేగింపులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. సుమారు 23000 గ్రామ పంచాయతీలలో ర్యాలీ  చేపట్టి లోహాలను సేకరించారు. ఆ లోహంతో విగ్రహ తయారీ చేపట్టారు. ఈ ప్రాజెక్టు ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యానికి ఉదాహరణ కూడా.