అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అమెరికా, నాటో బలగాలను అధ్యక్షుడు బైడెన్ వెనక్కి రప్పించడంతో తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోవడం తెలిసిందే. అక్కడ పనిచేస్తున్న విదేశీయులు ప్రాణ భయంతో విమానాశ్రయాలకు పరుగులు పెట్టడాన్ని మానవ హక్కుల సంఘాలు జీర్ణించుకోలేకపోయాయి. మరోవైపు భారతీయులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.
భారత్‌కు క్షేమంగా తిరిగొచ్చిన మరో 146 మంది..
భారత విదేశాంగ శాఖ తాజాగా 146 మందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చింది. దాదాపు 8 రోజుల తరువాత అఫ్గాన్ నుంచి భారత్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏఎన్ఐ మీడియా రిపోర్ట్ చేసింది. తాజాగా భారత్‌కు చేరుకున్న వారిలో ఒకరైన బాధితుడు సునీల్ జాతీయ మీడియాతో మాట్లాడారు. అమెరికా దౌత్యాధికారులు మమ్మల్ని కాబుల్ నుంచి నేరుగా ఖతార్ కు తీసుకెళ్లారు. ఆర్మీ బేస్‌లో మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. భారత దౌత్యకార్యాలయం అధికారులు అమెరికా అధికారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో మమ్మల్ని తిరిగి భారత్‌కు రప్పించారు’ అని ఢిల్లీలో తెలిపాడు.
Also Read: Afghanistan Crisis News: తాలిబన్ల నెక్ట్స్ టార్గెట్ అదే.. పంజ్‌షిర్ వైపు వందలాదిగా తరలుతోన్న వైనం..
భయాందోళనకు గురయ్యాం.. బాధితుడు సునీల్
అయితే అఫ్గాన్ నుంచి తాము బయటపడతామా లేదా అని చాలా భయాందోళనకు గురయ్యామని చెప్పాడు. కానీ అమెరికా దౌత్యాధికారుల విమానాలు రావడంతో మొదట ఇక్కడి నుంచి బయటపడి ఏదో ఒక దేశానికి వెళ్తున్నామని కాస్త ఊరట పొందామని వెల్లడించాడు. అయితే విమానాలు భారత్‌కు కాకుండా ఖతార్, ఇతర దేశాలకు చేరుకున్నాయి. అక్కడ వారం రోజులకు పైగా గడిపిన తరువాత కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Also Read: Afghanistan: త్వరలోనే ఆప్ఘనిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం.. తాలిబన్ ప్రతినిధి ప్రకటన
తమను సురక్షితంగా పలు విమానాలలో ఇక్కడికి తీసుకొచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి బాధితుడు సునీల్ ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు పంజ్‌షిర్ లోయను ఆక్రమించుకునేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. అఫ్గానిస్తాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ తన సైన్యంతో కలిసి తాలిబన్లపై తిరుగుబాటుకు వ్యూహం రచించారు.