Adipurush Movie: 


ఆప్‌ అసహనం..


ఆదిపురుష్ సినిమాకి కలెక్షన్లు ఎంత భారీగా వస్తున్నాయో...అదే స్థాయిలో నెగిటివిటీ కూడా వస్తోంది. కేవలం వీఎఫ్‌ఎక్స్ గురించే కాదు. సినిమాలోని కొన్ని సీన్స్ పట్ల చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. రావణుడిని చూపించిన విధానాన్నీ విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా విమర్శలు మొదలు పెట్టాయి. బీజేపీ పని గట్టుకుని ప్రమోట్ చేసిన ఈ సినిమా మనోభావాల్ని దెబ్బ తీసిందని మండి పడుతున్నాయి. ఆమ్‌ఆద్మీపార్టీ ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. ఈ సినిమా చూసిన తరవాత గుక్కపట్టి ఏడ్వాలనిపించిందని, అంతగా సీతారాములను అవమానించారని అన్నారు. శ్రీరాముడిని ఇలా చూపిస్తారా అంటూ ఫైర్ అయ్యారు. 


"ఎంతో బాధతో కన్నీళ్లు వస్తున్నాయి. బీజేపీ తమ రాజకీయాల కోసం సీతారాములను దారుణంగా అవమానించింది. సీతారాములు, హనుమంతుడి పేరు వింటేనే హిందువులంతా తలొంచి నమస్కరిస్తారు. భక్తి భావం ఉప్పొంగుతుంది. అలాంటి దేవుళ్లపై ఎంతో దారుణమైన సినిమా తీశారు. డైలాగ్‌లు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. హిందువులు మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయి. ఇంద్రజిత్తుడు సీతమ్మ గొంతు కోసినట్టు చూపించారు. ఇదంతా ఫిక్షన్ మాత్రమే. ఏవేవో ఊహించుకుని రామ్‌చరిత్ మానస్‌ని కూడా మార్చేస్తారా"


- సంజయ్ సింగ్, ఆప్ ఎంపీ






ఈ సినిమాని బీజేపీ నేతలంతా కలిసి ప్రమోట్ చేయడాన్నీ తప్పుబట్టారు సంజయ్ సింగ్. వీళ్లంతా కలిసి సీతారాములను అవమానపరిచారని మండి పడ్డారు. 


"పుష్కర్ ధామి, నరోత్తమ్ మిశ్రా, యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌ సింగ్ చౌహాన్, ఏక్‌నాథ్ శిందే..ఇలా ఎంతో మంది బీజేపీ నేతలు ఈ సినిమాని ప్రోత్సహించారు. కానీ...సినిమాలో మాత్రం వీధుల్లో మాట్లాడుకునే భాషను వాడారు. సీతారాములు, హనుమంతుడిపై ఇలాంటి సినిమా తీయించి బీజేపీ దారుణంగా అవమానించింది"


- సంజయ్ సింగ్, ఆప్ ఎంపీ 


ఉద్దవ్ థాక్రే శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఆదిపురుష్‌పై అసహనం వ్యక్తం చేశారు. సినిమాలోని డైలాగ్‌లను దారుణంగా ఉన్నాయని, మేకర్స్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 


"ఆదిపురుష్ డైలాగ్ రైటర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ముఖ్యంగా హనుమంతుడికి అలాంటి డైలాగ్‌లు పెట్టడం సరికాదు. భారతీయుల మనోభావాలు దెబ్బ తీశాయి. ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో దేవుళ్లకు అలాంటి డైలాగ్‌లు పెడతారా. మర్యాదపురుషోత్తమ్ రాముడి సినిమా తీసి ఆ మర్యాదనే మర్చిపోయారు"


- ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ