ABP Cvoter Exit Poll Results:
5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3వ తేదీన ఒకేసారి అన్ని రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ (Five States Exit Poll 2023) వెల్లడయ్యాయి. కచ్చితమైన అంచనాలు వేయడంలో ప్రతిసారీ సక్సెస్ అవుతున్న ABP CVoter Exit Poll కూడా ఈ ఫలితాలపై అంచనాలు వెలువరించింది. 5 రాష్ట్రాల్లో అంతా చాలా ఆసక్తికరంగా చూసింది తెలంగాణ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ (Telangana Exit Polls) గురించే. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం...తెలంగాణలో అధికార BRSకి భారీ మెజార్టీ దక్కే అవకాశాలైతే కనిపించడం లేదు. హంగ్ వచ్చే అవకాశాలూ ఉన్నాయని తెలిపింది. మొదటి నుంచి కాంగ్రెస్‌పై పాజిటివ్ వేవ్ కనిపించింది. దీన్నే ఆ పార్టీ బలంగా మలుచుకుంది. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 49 నుంచి 65 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇదే సమయంలో అధికార భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి 38-54 సీట్లు వచ్చే అవకాశముంది. బీజేపీకి 3-13 సీట్లు వచ్చే అవకాశముందని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఇతరులు 5 నుంచి 9 స్థానాల్లో గెలుస్తారని తేలింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 40.7 శాతం ఓట్లు వస్తాయి. అంటే గత ఎన్నికలతో ఓటింగ్ పర్సంటేజీ దాదాపుగా 12.4 శాతం పెరుగుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 28.3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి షాక్..!
ఇక రాజస్థాన్ విషయానికొస్తే..ABP CVoter Exit Poll అంచనాలు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 81 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 100 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి దాదాపు 20 స్థానాలు కోల్పోనుందన్నది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ (Rajasthan ABP CVoter Exit Poll ) అంచనా. అటు బీజేపీ మాత్రం గత ఎన్నికలతో పోల్చితే ఈ సారి పుంజుకుంటుందని తెలిపింది. పోయిన ఎన్నికల్లో 73 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి 104 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. బీఎస్‌పీ గత ఎన్నికల్లో 6 స్థానాలు గెలుచుకున్నప్పటికీ..ఈ సారి మాత్రం ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదని అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కి ఈ సారి 71-91 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 94-114 సీట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది.
మధ్యప్రదేశ్‌లో ఇలా..
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ABP CVoter Exit Poll అంచనా వేసింది. కాంగ్రెస్‌కి గత ఎన్నికల్లో 114 సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఆ సంఖ్య 125 వరకూ పెరిగే అవకాశముంది. బీజేపీ విషయానికొస్తే...గత ఎన్నికల్లో 109 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి 9 స్థానాలు తగ్గిపోయి 100 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీఎస్‌పీ గత ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి కూడా అదే 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కి 113-137 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీ 88-112 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది.
ఛత్తీస్‌గఢ్ అంచనాలేంటంటే..?
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి 41-53 సీట్లు వచ్చే అవకాశముంది. బీజేపీ 36-48 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇతరులు 0-4 వరకూ గెలుచుకుంటారని వెల్లడించింది. గతేడాది కాంగ్రెస్ 68 స్థానాలు సాధించింది. ప్రస్తుత అంచనాల మేరకు 47 సీట్లకే పరిమితం కానుంది. ఇక బీజేపీ మాత్రం బాగానే పుంజుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 42 సీట్లు గెలుచుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
మిజోరం పరిస్థితి ఇదీ..
మిజోరం ఎన్నికల ఫలితాలపై ABP CVoter Exit Poll 2023 ఆసక్తికర అంచనాలు వెలువరించింది. మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో మిజోరం నేషనల్ ఫ్రంట్ (MNF) ప్రస్తుతం అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఈ పార్టీ 26 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి ఆ సంఖ్య 18కి పడిపోయే అవకాశముందని అంచనా వేసింది ఎగ్జిట్ పోల్. కాంగ్రెస్ గత ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకోగా..ఈ సారి కూడా 5 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఇక ZPM (Zoram Peoples Moment) పార్టీ గత ఎన్నికల్లో 8 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఈసారి 15 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇతరులు 1-2 స్థానాలు గెలుచుకుంటారని వెల్లడించింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్.