'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రం దిల్లీలో మంటలు రేపుతోంది. ఈ చిత్రంపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నివాసం వద్ద భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు. భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు తేజస్వీ సహా 40-50 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
కేజ్రీవాల్ నివాసం వైపు నిరసనగా వెళ్లేందుకు ప్రయత్నించిన భాజపా కార్యకర్తలను వెంటనే పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో నిరసన హింసాత్మకంగా మారింది. బారీకేడ్లను దాటుకుని కొంతమంది కార్యకర్తలు ముందుకు వెళ్లారు. దీంతో పోలీసులు వారిపై జలఫిరంగులను ప్రయోగించారు. ఆ తర్వాత వాళ్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
ఆప్ ఆరోపణ
ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను చంపాలని భాజపా అనుకుంటోందని ఆ పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. పంజాబ్‌లో ఓటమిని తట్టుకోలేక కేజ్రీవాల్‌ను చంపాలని భాజపా వ్యూహాలు రచిస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ఫిర్యాదు కూడా నమోదు చేస్తామన్నారు.
కేజ్రీవాల్ నివాసం ఎదుట భాజపా యువ మోర్చా కార్యకర్తలు నిరసనకు దిగారు. రెచ్చిపోయిన నిరసనకారులు కేజ్రీవాల్ నివాసం వెలుపల సీసీటీవీ కెమెరాలు, బారికేడ్లు ధ్వంసం చేసినట్టు 'ఆప్' ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
కేజ్రీవాల్ ఏమన్నారు?
దిల్లీ నగర పరిధిలోని సినిమా హాళ్లలో ప్రదర్శిస్తోన్న 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమాకు వినోదపు పన్ను రాయితీ కల్పించాలని భాజపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కోరారు. దీనిపై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్న రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. కశ్మీరీ పండిట్ల పేరుతో కొందరు డబ్బులు దండుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
Also Read: Pure EV Electric Scooter: రహదారిపై మంటల్లో కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్- పెద్ద ప్రమాదమే ఇది!
Also Read: PAN-Aadhaar Linking: పాన్- ఆధార్ లింక్ చేయలేదా? మార్చి 31తో లాస్ట్, లేకపోతే భారీ ఫైన్!