ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు బాగా అమ్ముడుపోతున్నాయి. ఇందుకు కారణం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరగడమే. కొత్తగా వాహనాలు కొనాలనుకునే వాళ్లు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లే తీసుకుంటున్నారు. అయితే వీటి భద్రతపై చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజులగా వరుసగా విద్యుత్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి.
ఇటీవల ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు చనిపోయారు. అయితే, ఈ సంఘటనలు మరిచిపోకముందే చెన్నైలో ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి.
ఏం జరిగింది?
చెన్నైలో మంటలు చెలరేగుతున్న ప్యూర్ ఈవీ స్కూటర్ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల భద్రత గురించి ఈ సంఘటన తర్వాత మరింత ఆందోళన చెందుతున్నారు. రద్దీగా ఉండే రహదారి పక్కన పార్క్ చేసిన ఎరుపు ప్యూర్ ఈవీ ద్విచక్ర వాహనంలో నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్ది సేపు ట్రాఫిక్ జామ్ కూడా అయింది.
వరుస ఘటనలు
వాహన దారులను ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు చేసే విధంగా వాటిపై కేంద్రం భారీ రాయితీలు అందిస్తుంది. ఇలాంటి సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ సంఘటనలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర నిపుణుల బృందాన్ని కేంద్రం నియమించింది.
అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌లోకి వచ్చే ముందే భద్రతాపరమైన పరీక్షలను పూర్తి స్థాయిలో చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.
Also Read: PAN-Aadhaar Linking: పాన్- ఆధార్ లింక్ చేయలేదా? మార్చి 31తో లాస్ట్, లేకపోతే భారీ ఫైన్!