Arvind Kejriwal: 



విపక్ష కూటమికే మద్దతు..


పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుక్‌పాల్ సింగ్‌ అరెస్ట్‌తో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఓ డ్రగ్స్ కేస్‌లో అరెస్ట్ అయ్యారు సుక్‌పాల్ సింగ్. పంజాబ్‌లో ఇప్పుడు ఆప్ ప్రభుత్వం ఉంది. I.N.D.I.A కూటమిలో కాంగ్రెస్‌తో పాటు ఆప్ కూడా ఉంది. కానీ...అక్కడ కాంగ్రెస్ నేతను అరెస్ట్ చేయడం అలజడి సృష్టించింది. కూటమిలో విభేదాలు తలెత్తాయా..? అన్న అనుమానాలకు తావిచ్చింది. ఈ సందేహాలపై క్లారిటీ ఇచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) I.N.D.I.A కూటమిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కూటమికి తమ మద్దతు యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. ఆ కూటమి నుంచి వేరయ్యే ఆలోచనే చేయడం లేదని తెలిపారు. 


"విపక్ష కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పటికీ మద్దతుగా ఉంటుంది. ఆ కూటమి నుంచి బయటకు వచ్చే ఆలోచనే లేదు. ఈ కూటమి లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. సీట్‌ షేరింగ్‌పైనా త్వరలోనే క్లారిటీ వస్తుంది"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 






కాంగ్రెస్ ఆగ్రహం..


తమ పార్టీ డ్రగ్స్‌పై పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు కేజ్రీవాల్. చట్ట ప్రకారమే నడుచుకుంటామని తేల్చి చెప్పారు. కొందరిని కావాలనే లక్ష్యంగా చేసుకుని అరెస్ట్ చేస్తున్నారన్న ఆరోపణల్ని ఖండించారు. డ్రగ్స్ వ్యసనాన్ని అంతమొందించడమే తమ లక్ష్యమని అన్నారు. అటు కాంగ్రెస్ మాత్రం ఆప్ తీరుపై మండి పడుతోంది. సీనియర్లను టార్గెట్‌గా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తోంది. అరెస్ట్ అయిన సుక్‌పాల్ సింగ్‌ని కలవడానికి కూడా అనుమతినివ్వడం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ అరెస్ట్‌పై స్పందించారు. తమకు ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే...అలా చూస్తూ ఊరుకోమని, అలాంటి వాళ్లు ఎక్కువ రోజులు అధికారంలో ఉండరని మండి పడ్డారు. 


ఇటీవలే డ్రగ్స్‌ కేసులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాను పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చండీగఢ్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద గతంలో నమోదైన కేసులో జలాలాబాద్ పోలీసులు, ఉదయం ఎమ్మెల్యే నివాసంలో సోదాలు నిర్వహించారు.  పోలీసుల తనిఖీలను ఎమ్మెల్యే ఖైరా ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టాడు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యే ఖైరాను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌కు సంబంధించి‌ వారెంట్‌ చూపించాలని పోలీసులకు వాగ్వాదానికి దిగాడు. ఎమ్మెల్యే అరెస్ట్‌ను అతని కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాను జలాలాబాద్ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పాత ఎన్‌డీపీఎస్‌ కేసులో ఖైరాను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా, భోలాత్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 


Also Read: 2024లో జమిలి ఎన్నికలు లేనట్టే! నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్?