Delhi Weather News: ప్రస్తుతం భానుడు భారత దేశం పై తన ప్రతాపం చూపుతున్నాడు. దేశంలోని అనేక ప్రాంతాలను వడగాడ్పులు ముంచెత్తుతున్నాయి. బీహార్, జార్ఖండ్, ఒడిశాలతో సహా పలు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో మరణాలు సంభవించాయి. ఓ వైపు నైరుతి రుతుపవనాలు భారత్ లో ప్రవేశించాయి. మరో వైపు ఈ ఏడాది వేసవి చివరలో తన ప్రతాపాన్ని దేశ ప్రజలకు రుచి చూపుతున్నాడు. మహారాష్ట్రలోని నాగపూర్ లో శుక్రవారం రికార్డు ఉష్ణోగ్రత 56 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వేడిగాలులు ఉత్తర భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. రాజధాని వాసులు ఖాళీ బకెట్లతో వాటర్ ట్యాంకర్ల వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఢిల్లీలో రికార్డ్ ఉష్ణోగ్రత.. నిజమేనా?
ఇటీవల ఢిల్లీలోని ముంగేష్‌పుర్‌లో రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే ఢిల్లీ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత కావడంతో నిజంగానే అంత ఉష్ణోగ్రత నమోదు అయిందో లేదోనని చెక్ చేస్తామని కేంద్రం స్పందించింది. అక్కడ సెన్సార్ పనిచేస్తుందో, లేక నిజంగానే రికార్డ్ అయిందో నని అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా నాగ్ పూర్‌లో 56 డిగ్రీల ఉష్ణోగ్రత నిజమో కాదో తేలాల్సి ఉంది.
మధ్య, తూర్పు, ఉత్తర భారతదేశంలోని ఢిల్లీతో సహా అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మే 31 - జూన్ 1 మధ్య ఉత్తరప్రదేశ్‌లో.. మే 31 న హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు మే 31 - జూన్ 2 మధ్య వాయువ్య భారతదేశంలోని మైదానాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. నైరుతి రుతుపవనాలు ఈశాన్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, త్రిపుర, మేఘాలయ, అస్సాంలోని మిగిలిన ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలోని చాలా ప్రాంతాలలో విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది.
బిహార్‌లో 32 మంది మృతి
గురువారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45 నుంచి 48 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువ. ఇప్పటి వరకు దేశ రాజధానిలో 79 సంవత్సరాలలో అత్యధిక ఉష్ణోగ్రత 46.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కానీ రెండు రోజుల కిందట బీహార్‌లో వేడిగాలుల కారణంగా 32 మంది మరణించారు. వారిలో ఔరంగాబాద్‌లో 17 మంది, అర్రాలో ఆరుగురు, గయాలో ముగ్గురు , రోహ్తాస్‌లో ముగ్గురు, బక్సర్‌లో ఇద్దరు, పాట్నాలో ఒకరు ఉన్నారు. ఒడిశాలోని రూర్కెలాలో 10 మంది చనిపోయారు. జార్ఖండ్‌లోని పాలెంలో ఐదుగురు, రాజస్థాన్‌లో ఐదుగురు మరణించగా, ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఒకరు మరణించారు.
గతంలో, బీహార్‌లోని దర్భంగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలో హీట్ స్ట్రోక్ కారణంగా మరణించాడు. ఆ సమయంలో అతడి శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువగా 108 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పెరిగింది. దీంతో సదరు వ్యక్తి బహుళ అవయవ వైఫల్యంతో మరణించాడు. గురువారం రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45-48 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.