Himachal Flood: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు మరో సారి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 51 మంది మృతి చెందారు. పలు చోట్లు రోడ్లు మూసుకుపోయాయ. ఇళ్లు దెబ్బతిన్నాయి. దేవాలయ శిథిలాలలో చిక్కుకుని భక్తులు సమాధి అయ్యారు. హిమాచల్ రాజధానిలో రెండు కొండచరియలు విరిగిపడి అనేక మంది చనిపోయారు. అధికారులు 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 17 మందిని రక్షించినట్లు సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు.
సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయం శిథిలాల కింద ఇంకా ఎక్కువ మంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పవిత్రమైన సావన్ మాసం కావడంతో సమ్మర్ హిల్ శివాలయానికి భక్తులు పోటెత్తారు.ఈ సమయంలో ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది.
మండి జిల్లాలో వర్షాల కారణంగా 19 మంది మరణించారని డిప్యూటీ కమిషనర్ అరిందమ్ చౌదరి తెలిపారు. సోలన్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులతో సహా 11 మంది మరణించారు. కిలు, కిన్నౌర్, లాహౌల్, స్పితి మినహా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తొమ్మిది జిల్లాల్లో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో అక్కడి ప్రభుత్వం మంగళవారం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలు సిమ్లాలో సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని, కొండచరియలు విరిగిపడటం, విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో ఆదివారం రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా లేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు సోమవారం మూతపడ్డాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో 621 రోడ్లు మూసివేశారు. హమీర్‌పూర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నలుగురు మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైనట్లు హమీర్‌పూర్ డిప్యూటీ కమిషనర్ హేమ్‌రాజ్ బైర్వా తెలిపారు.
ఆదివారం రాత్రి వరద నీటిలో ఒకరు కొట్టుకుపోగా, మరో ఇద్దరిని రక్షించారు. మరో సంఘటనలో ఓ ఇల్లు కూలిపోయి ఓ వృద్ధురాలు సజీవ సమాధి అయ్యింది. ఆమె కొడుకును అధకారులు రక్షించారు. హమీర్‌పూర్‌లోని రంగస్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతి చెందగా, భగతు పంచాయతీలో ఇల్లు కూలిన ఘటనలో 80 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు.
సోలన్ జిల్లాలోని జాడోన్ గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షాలకు రెండు ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోయారు. ఆరుగురిని అధికారులు రక్షించారు. మృతులను హర్నం (38), కమల్ కిషోర్ (35), హేమలత (34), రాహుల్ (14), నేహా (12), గోలు (8), రక్ష (12)గా గుర్తించినట్లు సోలన్‌లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ సింగ్ తెలిపారు
సోలన్‌లోని బలేరా పంచాయతీలో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రామ్‌షెహెర్ తహసీల్‌లోని బనాల్ గ్రామంలో కొండచరియలు విరిగిపడి మరో మహిళ చనిపోయిందని సోలన్ డిప్యూటీ కమిషనర్ మన్మోహన్ శర్మ తెలిపారు, బడ్డీ ప్రాంతంలో ఒక వ్యక్తి మరణించాడు. మండి జిల్లాలో, సెగ్లి పంచాయతీలో ఆదివారం అర్థరాత్రి కొండచరియలు విరిగిపడటంతో రెండేళ్ల చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. ముగ్గురిని రక్షించినట్లు డిప్యూటీ కమిషనర్ చౌదరి తెలిపారు.
పండోహ్ సమీపంలోని సంభాల్ వద్ద ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని, ధర్మపూర్ ప్రాంతంలో రెండు మరణాలు నమోదయ్యాయని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. సిర్మౌర్ జిల్లాలో ఒక బాలుడు మరణించాడు. కాంగ్రాలో భారీ వర్షాలకు 11 ఏళ్ల బాలుడు సహా ఇద్దరు వ్యక్తులు మరణించారని జిల్లా మేజిస్ట్రేట్ నిపున్ జిందాల్ తెలిపారు.
సిమ్లాలో ఆలయం కూలిన ప్రదేశాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. సావన్ మాసం సోమవారం కావడంతో ఆలయానిక భక్తులు పోటెత్తారని ఈ క్రమంలో ప్రమాదం జరిగిందన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
NDRF బృందాలు కొండ ప్రాంతంలో సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద సిమ్లా-కల్కా రైలు మార్గం సమ్మర్ హిల్ సమీపంలో 50 మీటర్లు కొట్టుకుపోయింది. ట్రాక్‌లోని కొంత భాగం గాలిలో వేలాడుతూ ఉంది. ఆర్మీతో పాటు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ, రాష్ట్ర పోలీసు సిబ్బంది, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్‌లో ఆదివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిమ్లా-చండీగఢ్ రహదారితో సహా పలు రహదారులు మూసుకుపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి కాంగ్రాలో 275 మిమీ, ధర్మశాలలో 264 మిమీ, సుందర్‌నగర్‌లో 168 మిమీ, మండిలో 167 మిమీ, బెర్థిన్‌లో 149, సిమ్లాలో 135 మిమీ, ధౌలాకౌన్‌లో 111 మిమీ, నహాన్‌లో 107 మిమీ వర్షపాతం నమోదైంది. ఆగస్టు 18 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
జూన్ 24న రుతు పవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.7,171 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తెలిపింది. ఈ వర్షాకాలంలో రాష్ట్రంలో మొత్తం 170 క్లౌడ్ బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడటం జరిగాయని, దాదాపు 9,600 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.