Congress Working Committee Meeting : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Five States Assembly Elections )ఫలితాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు కాంగ్రెస్‌ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2024 పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. వరుసబెట్టి సమావేశాలు నిర్వహిస్తోంది. మొన్నటి వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలతో బిజీగా గడిపారు నేతలు. అవి కాస్త ముగియడంతో సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఢిల్లీ (Delhi)లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి, వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలు, ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చించారు. 


కలిసికట్టుగా పని చేయాలని ఖర్గే పిలుపు
ఐదు రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాల అనుభవాలతోనే 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టాలని  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికలను సీరియస్ గా తీసుకొని, పార్టీ గెలుపు కోసం పని చేయాలని నేతలు,  కార్యకర్తలకు సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి నిరాశ పరిచాయన్నారు ఖర్గే.  అసెంబ్లీ ఎన్నికల తప్పుల నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నామని, ఆ అనుభవాలతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పులు చేయకుండా ముందుకు సాగుతామన్నారు. సార్వత్రిక ఎన్నికలు పమీపిస్తున్నాయన్న మల్లికార్జున ఖర్గే, కార్యాచరణ రూపొందించాలని నేతలకు సూచించారు. కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని, ఎవరు అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. 


రెండో విడత జోడోయాత్రపై నిర్ణయం రాహుల్ గాంధీదే
సమావేశంలో రాహుల్ గాంధీ, రెండోసారి భారత్ జోడోయాత్రపై చర్చకు వచ్చింది. రాహుల్‌ గాంధీ మరోసారి భారత్‌ జోడో యాత్ర చేపట్టాలని నేతలు కోరుతున్నారని మల్లికార్జున వెల్లడించారు. అయితే రెండో విడత యాత్రపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం రాహుల్ గాంధీయేనని స్పష్టం చేశారు. తొలి విడత భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు జరింది. దాదాపు ఐదు నెలల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా,  ఢిల్లీ,  పంజాబ్ రాష్ట్రాల మీదుగా జమ్మూకశ్మీర్ వరకు సాగింది. రెండో విడత పాదయాత్ర పశ్చిమ కనుమల నుంచి తూర్పు కనుమల వరకు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. 


కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే
కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి  మమతా బెనర్జీతో పాటు పలు పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలు ఇండియా కూటమి సమావేశంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ప్రధాని అభ్యర్థిత్వంపై ఇప్పుడే ప్రకటన చేయొద్దని ఖర్గే వారించినట్లు తెలుస్తోంది. సమష్టిగా పోరాటం చేసి, విజయం సాధించిన తర్వాత ప్రధాన మంత్రి అభ్యర్థిని నిర్ణయిద్దామని ఖర్గే స్పష్టం చేసినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై 28 పార్టీల నేతలు ఒక అంగీకారానికి వచ్చారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు.