Delhi Weather : ఢిల్లీలో పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోంది. శీతాకాలం ముగింపు దశకు వచ్చినప్పటికీ వాతావరణంలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండడం లేదు. ఢిల్లీలో నమోదవుతోన్న ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో చలి బీభత్సం సృష్టించినా.. గడిచిన ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా జనవరి 30న, గురువారం అత్యంత వేడి రోజుగా నమోదైంది. సాధారణం కంటే 4.6 డిగ్రీలు ఎక్కువగా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా 26.7 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
గురువారం రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడంతో, నిరాశ్రయులైన ప్రజలు రక్షణ కోసం ఆశ్రయాల్లోకి రావడం కనిపించింది. అదే జనవరి 21, 2019న ఉష్ణోగ్రత 28.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అయితే ఈ రోజు ఉదయం 5.30 గంటలయ్యేసరికి ఈ ఉష్ణోగ్రతలో భారీ మార్పులొచ్చాయి. ఇది ఏకంగా 10.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని కొన్ని ప్రాంతాలలో పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గింది. సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రం చుట్టూ దృశ్యమానత 200 మీటర్ల వద్ద నమోదైంది.
వాతావరణ అంచనా
ఈ రోజు ఉదయం ఢిల్లీలో తేలికపాటి పొగమంచు కనిపించింది. ఈ రోజు కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ముందే అంచనా వేసింది. ఈ లెక్కన చూస్తే ఫిబ్రవరి 2న కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా నమోదయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. ఫిబ్రవరి 3,4 తేదీల్లో ఢిల్లీలో ఆకాశం మేఘావృతమై ఎన్‌సీఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఫిబ్రవరి 5 నాటికి గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ నుంతి 21 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవచ్చని అంచనా వేసింది.
చలిని తట్టుకోలేక 474 మంది మృతి
మరోపక్క ఈ చలికాలంలో ఢిల్లీలో 56 రోజుల వ్యవధిలో 474 మంది నిరాశ్రయుల మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్‌కు మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో, డిసెంబర్ 15, 2024 - జనవరి 10, 2025 మధ్య కాలంలో దాదాపు 474 మంది నిరాశ్రయులు చనిపోయారని సూచించే ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ (CHD) డేటాను ప్రస్తావించింది. సరైన దుస్తులు, దుప్పట్లు, ఉండడానికి తగిన ఆశ్రయం అందుబాటులో లేకపోవడం వల్లే వీరంతా చనిపోయారని ఈ ఎన్జీవో తెలిపింది. దేశ రాజధానిలో దాదాపు 80 శాతం మంది గుర్తుతెలియని మృతదేహాలు నిరాశ్రయులైన వారివేనని అంచనా వేసింది. వీధుల్లో నివసించే కొందరని ఉదాహారణలుగా చూపించిన మానవ హక్కుల కమిషన్.. వారు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు, మానసిక ఆరోగ్యం క్షీణించడం వంటి అనేక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్నారని కూడా తెలిపింది.
అంతకంతకూ పెరుగుతోన్న వాయు కాలుష్యం
ఢిల్లీ వాసులు ఈ చలి నుంచి ప్రస్తుతం కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ, కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశ రాజధానిలో GRAP III ఆంక్షలు విధించిన ఒక రోజు తర్వాత, ఢిల్లీలోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మరోసారి రీడింగ్ 381కి చేరుకోవడంతో 'చాలా పేలవమైన' కేటగిరీకి చేరుకుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (EWS) ప్రకారం, వాయు నాణ్యత సూచీ స్వల్పంగా పడిపోయింది.
Also Read : Gold-Silver Prices Today 31 Jan: ఒక్కరోజులో రూ.13,100 పెరిగిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ