IDBI Bank Viral Loan NPA : గ్రేట్ ఇండియా నౌటంకీ అనే కంపెనీ పెట్టి... గ్రేట్ ఇండియా తమాషా కంపెనీని గ్యారంటీర్‌గా చూపించి లోన్ తీసుకున్నారు. తీసుకున్నారు కానీ పైసా కట్టలేదు. చివరికి వడ్డీ కూడా కట్టలేదు. చూసి చూసి.. ఇక అప్పు ఇచ్చిన బ్యాంక్ అధికారులు ఆ నౌటంకీ, తమాషా కంపెనీల అడ్రస్‌లు వెదుక్కుంటూ వెళ్లారు. కానీ ఎక్కడా దొరకలేదు. దొరకడానికి అసలు ఉంటే కదా .. ! ఇదేదో సూపర్ హిందీ సినిమాలో కామెడీ సీన్ అనుకుంటున్నారేమో ... కానే కాదు. వంద శాతం నిజంగా జరిగింది. కావాలంటే ఈ పేపర్ ప్రకటనే సాక్ష్యం.
ఐడీబీఐ పేపర్లలో ఓ ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే... ఫలానా ట్ ఇండియా నౌటంకీ కంపెనీ, గ్రేట్ ఇండియా తమాషా కంపెనీ తమ వద్ద రుణాలు తీసుకుని ఎగ్గొట్టాయని అందు కోసం ఆ కంపెనీలు తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేస్తున్నామని ఆ ప్రకటన సారాంశం. ఐడీబీఐ మాత్రమే కాదు హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడాలు కూడా ఆ నౌటంకీ, తమాషా కంపెనీలకు లోన్లు ఇచ్చాయి. ఐడీబీఐ లోన్లు దాదాపుగా 93 కోట్ల రూపాయలకు చేరుకోవడంతో వారు ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బ్యాంకులకు ఆ కంపెనీలపేర్లు చూసినప్పుడు చిన్న అనుమానం కూడా రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.
అసలు ఆ కంపెనీలే పెద్ద ఫ్రాడ్ అనుకుంటే... నిజంగా ఆ కంపెనీలు తాకట్టు పెట్టిన ఆస్తులు ఇంకెంత ఫ్రాడో అనే అనుమానం చాలా మందికి వస్తోంది. అందుకే ఈ కంపెనీ ప్రకటనను సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.
సాధారణంగా ఎదైనా కంపెనీ దగ్గర సామాన్యులు రూ. లక్షో.. రెండు లక్షలో లోన్ తీసుకోవాలంటే సవాలక్ష డాక్యుమెంట్లు అడుగుతారు. కానీ పెద్ద పెద్ద కంపెనీలకు వందల కోట్లు లోన్లు ఇచ్చేటప్పుడు తమను బకరాలను చేయడానికే లోన్లు తీసుకుంటున్నామని పేర్లతోనే చెబుతున్నప్పటికీ బ్యాంక్ అధికారులు అర్థం చేసుకోలేకపోతున్నారన్న చాలా మంది సైటైర్లు వేస్తున్నారు.