ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(EWS) ఇచ్చే పది శాతం రిజర్వేషన్ తమిళనాడులో అమలు సాధ్యం కాదని ఆ రాష్ట్రప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఇది సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధమని కామెంట్ చేసింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ పద్దతి అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది.


అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ఈ అంశాన్ని  తమిళనాడు ప్రభుత్వం పొందుపరించింది. తమిళనాడులో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు వైవిధ్యమైన రిజర్వేషన్ పద్దతిని అమలు చేస్తున్నట్టు పేర్కొంది. అందులో భాగంగా అన్ని వర్గాలు న్యాయం జరుగుతోందని నమ్ముతున్నట్టు తెలిపింది. ఈ పరిస్థితిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్ అమలు తమ రాష్ట్రంలో సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌ అమలుకే తాము కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. ఆర్థికంగా వెనకుబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం సామాజిక న్యాయానికి విరుద్ధమని అభిప్రాయపడింది. 


ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా వారి అభివృద్ధికి 210 కోట్ల రూపాయల లోన్లు అందజేసినట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. 


అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన పూర్తి ప్రసంగాన్ని గవర్నర్‌ రవి చదవలేదని ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై డీఎంకే ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


ఇప్పటికే గవర్నర్‌, ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఇప్పుడు ఈ ప్రసంగంతో ఆ గ్యాప్ మరింత పెరిగింది. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో గవర్నర్‌ రవి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతినే రికార్డుల్లో ఉంచాలని స్టాలిన్‌ స్పీకర్‌ను కోరారు. దీనిపై తీర్మానం కూడా చేశారు.  


తీర్మానం సందర్భంగా చాలా విషయాలను అధికార డీఎంకే ప్రస్తావనకు తీసుకొచ్చింది. ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రంగంలో.. లౌకికవాదం, పెరియార్, బీఆర్‌ అంబేద్కర్, కామరాజు, అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖుల పేర్లు ప్రస్తావించకుండానే గవర్నర్‌ ప్రసంగాన్ని కొనసాగించారని ఆరోపించింది. 


గవర్నర్ తీర్పును సీఎం స్టాలిన్ తప్పుపట్టారు. గతంలో ఎక్కడా లేని సరికొత్త సంప్రదాయానికి గవర్నర్‌ శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీతోపాటు మిగతా పక్షాలు కూడా గవర్నర్‌ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేశాయి. 






ఈ వివాదం ఆన్‌లైన్‌లో కూడా పెను దుమారాన్ని సృష్టిస్తోంది. రాష్ట్రం నుంచి గవర్నర్‌ రవి వెళ్లిపోవాలంటూ డీఎంకే సానుభూతిపరులు ట్రోల్ చేస్తున్నారు. గెట్‌ అవుట్‌ రవి అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. యూనివర్శిటీల వివాదం వచ్చినప్పుడు కూడా ఈ హ్యాష్ ట్యాగ్‌ బాగా ట్రెండ్ అయింది.