Corona Cases in India: 


358 కేసులు నమోదు..


దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం...గత 24 గంటల్లో 358 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేరళలోనే 300 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే కేరళలో కరోనా సోకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య  2669గా ఉంది. కొవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేరళలో చనిపోయిన వారి సంఖ్య 72,059కి చేరుకుంది. గత 24 గంటల్లో 211 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్త కొవిడ్ వేరియంట్ JN.1 కారణంగా ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వేరియంట్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా కేరళలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఆరోగ్యమంత్రి వీణా జార్జ్. ఈ కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. శ్వాస సంబంధిత వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వీలైనన్ని ఎక్కువ మొత్తంలో టెస్ట్‌లు చేయాల్సిన అవసరముందని వివరించింది. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాజీ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ కేసుల పెరుగుదలపై స్పందించారు. కొవిడ్‌ని సాధారణ జలుబులా భావించి తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ఈ వ్యాధి కారణంగా దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం కనిపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలోని కొచ్చి హాస్పిటల్స్‌లో నమోదవుతున్న న్యుమోనియా కేసుల్లో 30% మేర కొవిడ్ పాజిటివ్‌గా ఉంటున్నాయని, ఇదే పరిస్థితి దేశవ్యాప్తంగా ఎదురయ్యే అవకాశముందని అంచనా వేశారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 వేరియంట్‌ సోకితే స్వల్ప లక్షణాలే కనిపిస్తుండొచ్చని, కానీ భవిష్యత్‌లో మరి కొన్ని వేరియంట్‌లు రావడానికి ఇది కారణం కావచ్చని అన్నారు. సాధారణ జలుబుతో పోల్చితే కొవిడ్‌ లక్షణాలు వేరుగా ఉంటాయని వివరించారు. 


 ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. JN.1 వేరియంట్‌ని "Variant of Interest" గా ప్రకటించింది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే...ఓ వేరియంట్‌ ఇమ్యూనిటీ వలయాన్ని దాటుకుని మరీ వ్యాప్తి చెందడం. ఎప్పటికప్పుడు వైరల్ లక్షణాలనూ మార్చేస్తుందీ వేరియంట్. అందుకు తగ్గట్టుగానే వైద్యంలోనూ మార్పులు చేయాల్సి వస్తుంది. వ్యాక్సిన్‌లు కొత్తగా తయారు చేసుకోవాల్సిందే. అయితే...ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేనప్పటికీ ఎక్కువ మందికి సోకే లక్షణముంటుంది ఈ వేరియంట్‌కి. నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం..ఈ వైరస్ స్ట్రెయిన్ చాలా సులభంగా రోగ నిరోధక శక్తిని ఛేదించుకోగలదు. అంతే కాదు. అంతే సులభంగా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. అంటే ఇన్‌ఫెక్షన్ రేటు ఎక్కువ. అలా అని..ఇదేదో ప్రమాదకరమైన జబ్బు అని భయపడాల్సిన పని లేదన్నది నిపుణుల మాట. గతంలో ఈ స్ట్రెయిన్‌ని మరో వేరియంట్‌కి సబ్‌ వేరియంట్‌గా వెల్లడించిన WHO..ఇప్పుడు సెపరేట్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌గా క్లాసిఫై చేసింది. 


Also Read: X Down: ఉన్నట్టుండి 'X' సర్వర్ డౌన్, టైమ్‌లైన్‌లో కనిపించని పోస్ట్‌లు