Andhra Pradesh Crime News: పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన కొత్త జంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. సినిమాకు వెళ్లి వస్తామని చెప్పిన నవదంపతులు ఇలా బలవన్మరణానికి యత్నించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 


మోర్త గ్రామానికి చెందిన శివరామకృష్ణకు వడలి గ్రామానికి చెందిన సత్యవాణితో ఐదు రోజుల క్రితం వివాహమైంది. రెండు కుటుంబాలు, బంధువులు, ఇరు గ్రామల ప్రజల సమక్షంలో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లైనప్పటి నుంచి ఇద్దరూ సరదానే ఉన్నారు. ఏమైందో ఏమో కాని మంగళవారం నుంచి కనిపించడం లేదు. 


మంగళవారం భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది సత్యవాణి. సాయంత్రానికి సినిమాకు వెళ్తున్నామని చెప్పి ఇద్దరూ బైక్‌పై ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే మధ్యాహ్నం బయటకు వెళ్లిన జంట రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో కంగారు మొదలైంది. 
మోర్త వెళ్లారు ఏమో అని అక్కడికి ఫోన్ చేసి అడిగారు. వాళ్లు కూడా రాలేదని చెప్పడంతో అందరిలో టెన్షన్‌ ఎక్కువైంది. రాత్రంతా ఎవరెవరికో ఫోన్‌లు చేశారు. ఎవరూ తమ ఇంటికి రాలేదంటే రాలేదని చెప్పారు. దీంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. 


ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. అందర్నీ విచారించారు. బుధవారం ఉదయం నుంచి శోధిస్తే  చివరకు వాళ్లు ప్రయాణించిన బైక్ దొరికింది. సిద్ధాంతం వంతెన వద్ద బైక్‌ను గుర్తించిన పోలీసులు జంట ఆత్మహత్య చేసుకుందేమో అని అనుమానించారు. గాలింపు చేపట్టారు. 


వెతుకులాట సాగుతున్న టైంలోనే శివరామకృష్ణ బతికే ఉన్నాడని పోలీసులకు తెలిసింది. తణుకులోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు గుర్తించారు. ఓ టీం ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆయన్ని విచారిస్తే అసలు సంగతి చెప్పుకొచ్చాడు. తాము ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి నదిలో దూకేసినట్టు వివరించాడు. 


నదిలో దూకిన తర్వాత తాను ప్రాణభయంతో ఈదుకుంటూ బయటకు వచ్చేశాను అని సత్యవాణి మాత్రం చనిపోయినట్టు చెప్పుకొచ్చాడు. దీనిపై సత్యవాణి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దురు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు... శివరాకృష్ణ బతికి రావడం ఏంటీ సత్యవాణి చనిపోవడం ఏంటని పోలీసులు నిలదీశారు. 


ఏదో నాటకం ఆడుతున్నట్టు కనిపిస్తోందని సత్యవాణికుటుంబం అనుమాన పడుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి అసలు విషయం లాగాని కోరుతోంది. అయితే ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత విచారణ చేస్తామని అంటున్నారు పోలీసులు.