కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో చాలా కార్యకలాపాలు నిలిచిపోయాయి. గత ఏడాదిగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు కూడా లేదు. ఆంక్షలతో మాత్రమే కొన్ని విమాన సేవలు నడిచాయి. ఎంతో మంది అక్కాచెల్లెళ్లు విదేశాల్లో ఉన్న తమ సోదరులకు రాఖీ పంపే అవకాశాన్ని కోల్పోయారు. తమ ప్రేమను చూపించే వీలు లేకుండా పోయింది. భారత్ లో ఎంతోమంది అక్కాచెల్లెళ్ల సోదరులు విదేశాల్లో నివసిస్తున్నారు.
రాఖీ పౌర్ణమి వచ్చిందంటే సరిగ్గా సమయానికి చెల్లెళ్లు పంపే రాఖీ అన్నలకు చేరేది. కానీ గత ఏడాది వచ్చిన కరోనా ఆ ప్రేమను దూరం చేసింది. కరోనా కారణంగా విదేశాల్లో పోస్టల్ సర్వీసులు మూతపడ్డాయి.
ఈ ఏడాది భారత తపాలా శాఖ విదేశాల్లో సేవలను పునరుద్ధరించింది. ఇప్పుడు విదేశాల్లో ఉన్న తమ సోదరులకు రాఖీ పంపించుకునే అవకాశం వచ్చింది. ఈ మేరకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ డిపార్ట్ మెంట్ ట్వీట్ చేసింది.
ప్రపంచంలోని 101 దేశాలకు రాఖీ పంపించడానికి తపాలాశాఖ నిర్ణయించింది. 67 దేశాలకు ఈఎమ్ఎస్ (ఎక్స్ ప్రెస్ మెయిల్ సర్వీస్) ద్వారా రాఖీ పంపించే అవకాశం ఉంది.
దేశాల జాబితా..
అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, బ్రెజిల్, బెల్జియం, డెన్ మార్క్, ఈజీప్ట్, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఇండోనేసియా, ఐర్లాండ్, ఇటలీ, మలేసియా, మాల్దీవులు, నేపాల్, మెక్సికో, ఒమన్, నార్వే, కతార్, రష్యా, సౌదీ అరేబియా, శ్రీలంక, స్విట్జర్లాండ్, యూఏఈ, యూకే, యూఎస్ఏ. ఇలా మొత్తం 101 దేశాలకు ఎయిర్ పార్సిల్స్ ద్వారా కూడా రాఖీలను పంపించనుంది. రాఖీ లేఖలను 99 దేశాలకు పంపించనుంది. 14 దేశాలకు ఐటీపీఎస్ పంపనుంది.
రాఖీ గొప్పదనం..
చిన్నప్పటి నుంచి తమను కంటికి రెప్పలా కాపాడుతోన్న సోదరులకు ఎంతో ప్రేమతో రాఖీ పంపిస్తారు అక్కాచెల్లెళ్లు. జీవితాంతం తమకు తోడుగా ఉండాలని, ప్రతి కష్టసుఖంలోనూ తమ వెంట నిలవాలని సోదరులకు గుర్తుచేయడమే ఈ రాఖీ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాఖీకి ఎనలేని ప్రత్యేకత ఉంది. ఎంత దూరంలో ఉన్నా ఆరోజు తమ తోబుట్టువుల దగ్గరకు వెళ్లాలనుకుంటారు సోదరులు.