చర్చలు ఎలా జరిగాయంటే..?
భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతూనే ఉంది. లైన్ ఆప్ యాక్చువల్ కంట్రోల్ LAC వద్ద ఉద్రిక్తత పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు. ఏదో ఓ విషయంలో చైనా, భారత్ సైనికులను కవ్విస్తూనే ఉంది. గల్వాన్ ఘటన తరవాత, రెండు దేశాల మధ్య వైరం తీవ్రమైనప్పటికీ..అదే సమయంలో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఇప్పటికే LAC విషయమై 15 రౌండ్ల చర్చలు జరిగాయి. ఇటీవలే 16వ రౌండ్ భేటీ కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతను తగ్గించేందుకు బలగాల ఉపసంహరణకు అంగీకరించినట్టు సమాచారం. హాట్‌స్ప్రింగ్స్ వద్ద ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్లిపోవాలని, కమాండర్ స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించారని తెలుస్తోంది. భారత్ వైపు ఉన్న చుషులు-మోల్డో సరిహద్దు వద్ద ఈ చర్చలు జరిగాయి. 14 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ఏ సేన్‌గుప్తా
భారత్ తరపున చర్చలో పాల్గొన్నారు. చాన్నాళ్ల క్రితమే ఈ చర్చలు ఆగిపోయాయి. అయితే ఈ వివాదం ఇంకా ముదరకముందే ఇలాంటి సంప్రదింపులు కొనసాగించటం అవసరం అని భావించిన విదేశాంగ మంత్రి జైశంకర్, చర్చలు తిరిగి ప్రారంభమయ్యేలా చొరవ చూపించారు. గత నెల చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీతో భేటీ అయ్యారు జైశంకర్. జీ-20 సదస్సులో పాల్గొన్న సందర్భంలోనే ఎల్‌ఏసీ వివాదంపై చర్చించారు.
"ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు రెండు దేశాలూ అంగీకరించాయి. చర్చలు ఇదే విధంగా కొనసాగించి, ఇతర ప్రాంతాల్లోనూ బలగాలను ఉపసంహరించుకునేలా చేయాలని భావిస్తున్నాం. సరిహద్దులో శాంతిని పునరుద్ధరించేందుకు ఇది ఎంతో అవసరం" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చివరిసారి మార్చి 11వ తేదీన ఇండియన్ ఆర్మీ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య చర్చలుజరిగాయి.
Also Read: China Floods: చైనాను వణికిస్తోన్న వరదలు- 12 మంది మృతి