India China Clash: భారత్- చైనా సైనికుల మధ్య అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల ఘర్షణ జరిగింది. డిసెంబర్‌ 9న భారత్‌ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించగా.. డ్రాగన్‌ చర్యను భారత బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని మోదీ సర్కార్ తెలిపింది. అయితే తాజాగా భారత్- చైనా సైనికులు పోట్లాడుకుంటున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. 






వీడియోలో


ఈ వీడియోలో.. చైనా ద‌ళాలు భార‌త భూభాగంలోకి వచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్‌ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న చైనా జవాన్లను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పి కొట్టాయి. సరిహద్దు దాటాల‌నుకుంటున్న చైనా ఆర్మీని.. భార‌త సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. గుంపుగా వచ్చిన చైనా దళాలపై ఇండియన్‌ ఆర్మీ లాఠీలతో మూకుమ్మడిగా దాడి చేసింది. 


ఆర్మీ


అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో డిసెంబర్‌ 9 జరిగిన ఘటనకు సంబంధించినది కాదని ఇండియన్‌ ఆర్మీ వెల్లడించినట్లు కొన్ని వార్తా సంస్థలు తెలిపాయి. 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఈ దాడి ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.


ఇదీ జరిగింది 


డిసెంబర్ 9న అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. 


ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం.  మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు.


"డిసెంబరు 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో PLA దళాలు చొరబడి.. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. అయితే మన సైనికులు ఎవరూ చనిపోలేదు. అలానే తీవ్రమైన గాయాలు కాలేదని నేను ఈ సభకు చెప్పాలనుకుంటున్నాను. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల చైనా సైనికులు తమ సొంత స్థానాలకు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత డిసెంబర్ 11న ఆ ప్రాంత స్థానిక కమాండర్.. చైనా స్థానిక కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి ఈ సంఘటన గురించి చర్చించారు. సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించాలని భారత్ పిలుపునిచ్చింది.                                   "


-    రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి

Also Read: Iran Protesters Jailed: నిరసనలు చేసినందుకు 400 మందికి జైలు శిక్ష