India-China Border Clash: 2020, మే 5... ప్రపంచంలోనే రెండు పవర్‌ఫుల్ దేశాలైన భారత్- చైనా మధ్య తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో ప్రతిష్టంభన తలెత్తింది. అనంతరం అదే ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనా వైపు ఈ సంఖ్య ఇంకా ఎక్కువే అని తేలింది. కానీ తమవైపు నలుగురు సైనికులు మాత్రమే మృతి చెందినట్లు చైనా చెప్పుకొచ్చింది.


మళ్లీ 2022 డిసెంబర్ 9.. అంటే గల్వాన్ ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత మరోసారి భారత్- చైనా మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈసారి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంట ఘర్షణ జరిగింది. ఇందులో ఇరుపక్షాల సైనికులు గాయపడ్డారు. భారత సైన్యం ఈ అంశంపై ప్రకటన విడుదల చేసినా.. క్షతగాత్రుల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. భారత ఆర్మీ.. ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా డ్రాగన్ సైన్యం ఎందుకు వినడం లేదు. మాటలతో, చేతలతో సమాధానమిచ్చినా చైనాకు బుద్ధి రాదా? అసలు తాజా ఘర్షణలో ఏం జరిగింది?


ఇదీ జరిగింది


డిసెంబర్ 9న అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్దకు చైనా సైనికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పీఎల్‌ఏ సేనలు తమ సరిహద్దు దాటి భారత భూభాగంలో పెట్రోలింగ్‌కు వచ్చిన సమయంలో ఈ ఘర్షణ జరిగింది. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించిన.. చైనా జవాన్లను మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. 


ఘర్షణ జరిగిన సమయంలో సుమారు 600 మంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ దళ సభ్యులు అక్కడున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్‌కు చెందిన కనీసం మూడు వేర్వేరు యూనిట్లు ఘర్షణ స్థలంలో ఉన్నట్లు సమాచారం.


క్షతగాత్రులు


ఈ ఘర్షణపై భారత సైన్యం ప్రకటన విడుదల చేసినా.. క్షతగాత్రుల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. తొలుత ఆరుగురు సైనికులు గాయపడ్డారంటూ నివేదికలు వెలువడగా.. తాజాగా ఆ సంఖ్య 20కి పైగా ఉంటుందని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. అయితే క్షతగాత్రుల సంఖ్య భారత్‌ కంటే చైనా వైపు అధికంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రకటన చేశారు.


"డిసెంబరు 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో PLA దళాలు చొరబడి.. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. అయితే మన సైనికులు ఎవరూ చనిపోలేదు. అలానే తీవ్రమైన గాయాలు కాలేదని నేను ఈ సభకు చెప్పాలనుకుంటున్నాను. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల చైనా సైనికులు తమ సొంత స్థానాలకు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత డిసెంబర్ 11న ఆ ప్రాంత స్థానిక కమాండర్.. చైనా స్థానిక కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి ఈ సంఘటన గురించి చర్చించారు. సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించాలని భారత్ పిలుపునిచ్చింది.                                   "


-    రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి


కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా దీనిపై స్పందించారు. మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం ఏ ఒక్కరూ భారత్‌లో అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని స్పష్టం చేశారు.



ప్రధాని సమీక్ష


తాజా భారత్-చైనా సరిహద్దు ఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మరోవైపు భారత వాయుసేన అరుణాచల్‌ ప్రదేశ్‌ వద్ద యాక్టివ్‌ కాంబాట్‌ పెట్రోల్స్‌ను (యుద్ధవి మానాలతో గస్తీ) మొదలుపెట్టింది. చైనా వాయుసేన కదలికలను గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వాయుసేన వర్గాలు పేర్కొన్నాయి.


అరుణాచల్‌ ప్రదేశ్‌ వద్ద సరిహద్దుల్లో ఘర్షణలు జరగడం ఇదేం తొలిసారి కాదు. 2021 అక్టోబర్‌లో కూడా పెట్రోలింగ్‌ విషయంలో భారత్‌-చైనా సేనలు ఘర్షణ పడ్డాయి. ఇటీవల కాలంలో చైనా సైన్యం భారీ సంఖ్యలో దళాలను పెట్రోలింగ్‌కు పంపుతోంది. పెట్రోలింగ్‌  చేసే ప్రదేశాలు చైనావే అని వెల్లడించేందుకు ఇలా చేస్తోంది. 


Also Read: Rajnath Singh Statement: 'మన సైనికులు ఎవరూ చనిపోలేదు- చైనాను బలంగా తిప్పికొట్టాం'