Rajnath Singh Statement: భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన తాజా ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. లోక్‌సభలో ప్రకటన చేశారు. చైనా దళాల దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా అడ్డుకుందన్నారు.
డిసెంబరు 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో PLA దళాలు చొరబడి.. యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని మన దళాలు సమర్థంగా అడ్డుకున్నాయి. మన భూభాగంలోకి చొరబడకుండా చైనా సైనికులను.. భారత దళాలు ధైర్యంగా నిలువరించి వారిని తిరిగి తమ స్థానానికి వెళ్లేలా చేశాయి. ఈ విషయాన్ని దౌత్య మార్గాల ద్వారా చైనాకు భారత్ తెలిపింది. మన సరిహద్దులను కాపాడేందుకు మన బలగాలు కట్టుబడి ఉన్నాయి. దానిని సవాలు చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని నేను సభకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను. - రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
సురక్షితంగా
డిసెంబర్ 9న జరిగిన ఘర్షణలో భారత సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ ఘర్షణలో ఇరువైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు. అయితే మన సైనికులు ఎవరూ చనిపోలేదు. అలానే తీవ్రమైన గాయాలు కాలేదని నేను ఈ సభకు చెప్పాలనుకుంటున్నాను. భారత సైనిక కమాండర్ల సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల చైనా సైనికులు తమ సొంత స్థానాలకు వెనుదిరిగారు. ఈ సంఘటన తర్వాత డిసెంబర్ 11న ఆ ప్రాంత స్థానిక కమాండర్.. చైనా స్థానిక కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి ఈ సంఘటన గురించి చర్చించారు. సరిహద్దు వద్ద శాంతిని కొనసాగించాలని భారత్ పిలుపునిచ్చింది. - రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
Also Read: India-China Faceoff: భారత్- చైనా సరిహద్దులో టెన్షన్ టెన్షన్- రంగంలోకి రాజ్‌నాథ్ సింగ్