నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. కుమారులు లేకపోవడం, బంధువులెవరూ ముందుకు రాకపోవడంతో కుమార్తెలే ఆ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి శవంతోపాటు వారు కూడా శ్మశానానికి బయలుదేరారు. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ ఇద్దరు కుమార్తెలు తండ్రితో తమకున్న అనుబంధాన్ని అలా చాటుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది.


విడవలూరు మండలం చౌకచర్ల గ్రామానికి చెందిన శంకుల సుబ్రహ్మణ్యం రెడ్డి 20ఏళ్ల క్రితం స్వగ్రామాన్ని వదిలిపెట్టి నెల్లూరులో స్థిరపడ్డారు. కోవూరు, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఆయన కాంట్రాక్ట్ పనులు నిర్వహించేవారు. ఈ క్రమంలో ఆయన ఓ పెద్ద కంపెనీ తరపున నాగాలాండ్ లో కాంట్రాక్ట్ పనులు చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడినుంచి పోలీసులు ఆయన శవాన్ని స్వగ్రామానికి తరలించారు. కొడుకులు లేకపోవడంతో కూతుర్లే తండ్రి శవానికి అంత్యక్రియలు నిర్వహించారు.


ఓరియంటల్ కంపెనీ తరపున నాగాలాండ్ లో సబ్ కాంట్రాక్ట్ వర్క్ లు చేస్తున్న సుబ్రహ్మణ్యం రెడ్డికి స్థానికంగా డబ్బులు వసూలు కాలేదు. దాదాపుగా 7.97 కోట్ల రూపాయల పనుల్ని నాగాలాండ్ లో పూర్తి చేశాడు సుబ్రహ్మణ్యం రెడ్డి. ఆ బిల్లులు చెల్లించడంలో కంపెనీ ఆలస్యం చేసింది. దీంతో తాను అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టి మోసపోయినట్టు సుబ్రహ్మణ్యం రెడ్డి కొంతకాలంగా బాధపడుతూ ఉండేవాడు. దీనికి తోడు, అప్పులు ఇచ్చినవారు సుబ్రహ్మణ్యం రెడ్డిపై ఒత్తిడి పెంచారు. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు నాగాలాండ్ లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


సూసైడ్ నోట్..


కంపెనీ యాజమాన్యం బెదిరించడం, అప్పులు ఇచ్చినవారు ఒత్తిడి తేవడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్ రాశాడు సుబ్రహ్మణ్యం రెడ్డి. నాగాలాండ్ లోని కాంట్రాక్ట్ వర్క్ స్థలంలోనే ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత నాగాలాండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యగా నిర్థారించుకుని పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాన్ని నెల్లూరుకి తరలించారు. సుబ్రహ్మణ్యం రెడ్డి సొంత ఊరు చౌకచర్ల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుబుంట సభ్యులు నిర్వహించారు. అయితే ఆయనకు కొడుకులు లేకపోవడంతో కుమార్తెలే ముందుకొచ్చారు. కుమార్తెలు తేజ, లిఖిత.. తమ తండ్రి అంత్యక్రియలు తామే చేస్తామన్నారు. వారే ఆ క్రతువుల్లో పాల్గొన్నారు. తండ్రితో తమకున్న అనుబంధానికి ప్రతీకగా వారు ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. తండ్రి అంటే తమకు చాలా ఇష్టమని, కానీ ఇలా అర్థాంతరంగా అందర్నీ వదిలిపెట్టి వెళ్తాడనుకోలేదని కన్నీటిపర్యంతం అయ్యారు కుమార్తెలు. కుమార్తెలే ఇలా అంత్యక్రియల్లో పాల్గొనడం చూసి ఆ ఊరి వారంతా కన్నీరు పెట్టారు. కుమార్తెలకు తండ్రిపై ఉన్న ప్రేమను చూసి చలించిపోయారు.


మాకు న్యాయం చేయండి..


కాంట్రాక్ట్ కంపెనీ చేసిన మోసం వల్ల తమ తండ్రి చనిపోయాడని, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు సుబ్రహ్మణ్యంరెడ్డి కుటుంబ సభ్యులు. సుబ్రహ్మణ్యం రెడ్డి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటున్నారు.