India Vs Canada Issue: 


వార్నింగ్ వీడియో..


India Canada Issue: నవంబర్ 19వ తేదీన Air India విమానాల్లో ఎవరూ ప్రయాణించొద్దంటూ ఖలిస్థానీ మద్దతుదారుడు గురుపత్వంత్ సింగ్ పన్నున్ (Gurpatwant Singh Pannun) వార్నింగ్ ఇచ్చాడు. వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ అవడమే కాకుండా సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే భారత్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు కెనడా ఈ వీడియోపై స్పందించింది. ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులను అంత తేలిగ్గా తీసుకోమని, ముఖ్యంగా ఎయిర్‌ లైన్స్‌ విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేసింది. కెనడా రవాణా మంత్రి పాబ్లో రోడ్రిగెజ్ ( Pablo Rodriguez) స్వయంగా ఈ ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. కెనడా పోలీసులు ఇప్పటికే విచారణ మొదలు పెట్టారని తెలిపారు. గత వారమే గురుపత్వంత్ సింగ్ ఈ వీడియో పోస్ట్ చేశాడు. Sikhs for Justice సంస్థకి జనరల్ కౌన్సిల్‌గా ఉంటున్నాడు గురుపత్వంత్. "నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించకండి. మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయ్" అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే...ఇది బెదిరింపు కాదని, కేవలం భారత్‌తో మైత్రిని కొనసాగించకుండా నిషేధం విధించాలన్నదే తమ లక్ష్యం అని చెప్పాడు. కెనడాలో దాదాపు 7 లక్షల 77 వేల మంది సిక్కులున్నారు. ఆ దేశ జనాభాలో వీళ్ల వాటా 2%. అందుకే చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది కెనడా ప్రభుత్వం. 


నిజ్జర్ హత్యతో చిచ్చు..


ఈ ఏడాది జూన్‌లో హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య (Hardeep Singh Nijjar Killing) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టింది.  ఆ సమయంలోనే ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యలో భారత్ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య దూరం పెరుగుతూనే ఉంది.


నిజ్జర్ హత్య కేసు విచారణలో కెనడా అధికారులు పోలీసులకు విచారణలో సహకరించడం లేదని ఆరోపించారు భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ. Globe and Mail కి ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. విచారణను కొంత మంది కెనడా ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు. కుట్రపూరితంగా భారత్‌పై ఈ తప్పుని తోసేందుకు ప్రయత్నం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. 


"నిజ్జర్ హత్యపై కెనడాలో విచారణ జరుగుతోంది. కానీ అది సరైన విధంగా జరగడం లేదు. ఇప్పటికే కొందరు అధికారులు ఇందులో జోక్యం చేసుకున్నారు. విచారణని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ హత్య వెనకాల కచ్చితంగా భారత్‌కి చెందిన వాళ్లు ఉన్నారని నిరూపించాలని పై నుంచి ఒత్తిడి వస్తోంది. కెనడా భద్రతా బలగాలన్నీ పనిగట్టుకుని మరీ దీన్ని రుజువు చేసేందుకు కుట్ర చేస్తున్నాయి"


- సంజయ్ కుమార్ వర్మ, భారత హై కమిషనర్


Also Read: Delhi Pollution News: మేం జోక్యం చేసుకుంటే తప్ప మీలో చలనం రాదా? ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం