India Canada Tenions: 


తగ్గిన స్టడీ పర్మిట్స్..


భారత్, కెనడా మధ్య వివాదం (India Canada Tensions) ఇంకా సద్దుమణగలేదు. నిజ్జర్ హత్యతో మొదలైన విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా కెనడాకి వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తలంగా వెంటనే వెళ్లిపోవాలంటూ అప్పట్లో భారత్‌ తేల్చి చెప్పింది. ఈ మేరకు వాళ్లంకా వెనక్కి వెళ్లిపోయారు. ఇండియన్ స్టూడెంట్స్‌కి స్టడీ పర్మిట్‌ (Canada Study Permits) ఇవ్వడంపై కెనడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ ఈ విషయం వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది స్టడీ పర్మిట్స్ సంఖ్య బాగా తగ్గిపోయిందని, త్వరలోనే ఇది సాధారణ స్థితికి వచ్చే అవకాశముందని అన్నారు. హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనకాల భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. అప్పటి నుంచి భారత్‌, కెనడా మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే...ఈ ఏడాది కూడా స్టడీ పర్మిట్స్‌పై ఆ ప్రభావం తప్పకుండా కనిపిస్తుందని మిల్లర్ స్పష్టం చేశారు. 


"భారత్‌తో ప్రస్తుతం కొనసాగుతున్న విభేదాల కారణంగా స్టడీ పర్మిట్స్‌ సంఖ్య బాగా తగ్గిపోయింది. గతేడాది అక్టోబర్‌లో భారత్ నుంచి కెనడాకి చెందిన 41 మంది దౌత్యవేత్తల్ని బలవంతంగా వెనక్కి పిలవాల్సి వచ్చింది. ఈ విభేదాలతో కెనడాకి రావాలనుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. వాళ్లు వేరే దేశాలకు వెళ్లాలనుకుంటున్నారు"


- మార్క్ మిల్లర్, కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ 


86% తగ్గిపోయాయట..


గతేడాది నాలుగో త్రైమాసికంలో ఇండియన్ స్టూడెంట్స్‌ ఇచ్చిన స్టడీ పర్మిట్స్ సంఖ్య దాదాపు 86% మేర పడిపోయిందని కెనడా అధికారికంగా వెల్లడించింది. అంతకు ముందు త్రైమాసికంలో ఆ సంఖ్య  108,940గా ఉంటే చివరి మూడు నెలల్లో మాత్రం అది 14,910కి పడిపోయింది. నిజానికి కెనడాకి వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. కెనడా పర్మిట్ చేసే వాటిలో 40% పైగా స్టడీ పర్మిట్స్ ఇండియా నుంచే ఉంటాయి. కెనడాలోని యూనివర్సిటీలు స్థానిక విద్యార్థులతో కన్నా అంతర్జాతీయ విద్యార్థులతోనే నిండిపోయుంటాయి. 


కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవలే మరోసారి భారత్‌పై అసహనం వ్యక్తం చేశారు. ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని మరోసారి కవ్వించారు. అంతే కాదు. చట్టప్రకారం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్‌తో సంప్రదింపులు జరిపానని, అటు అమెరికాతోనూ మాట్లాడానని చెప్పారు. సరైన విధంగా విచారణ చేపట్టేందుకు సహకరించాలని కోరినట్టు గుర్తు చేశారు. ఈ హత్యని తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు వెల్లడించారు ట్రూడో. అన్ని దర్యాప్తు సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతూ విచారణ చేపడుతున్నట్టు వివరించారు. తాము చేసిన ఆరోపణల్లో తప్పేమీ లేదని, విచారణలో భారత్ ఏ విధంగానూ సహకరించడం లేదని మండి పడ్డారు. పైగా Vienna Convention ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తమ దౌత్యవేత్తల్ని భారత్ నుంచి వెనక్కి రప్పించాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు ట్రూడో. 


Also Read: ఫ్లైట్‌లోని టాయిలెట్‌లో ఇరుక్కున్న ప్రయాణికుడు, తలుపు తెరుచుకోక గంటపాటు నరకం