Dead Mouse In Barbeque Nation Food: ముంబయి పర్యటన ఒక వ్యక్తికి మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆర్డర్ చేసిన భోజనంలో చనిపోయిన ఎలుక బయటపడింది. ఫుడ్ పాయిజన్‌తో కొన్ని రోజుల పాటు ఆస్పత్రి పాలయ్యాడు. తనకు జరిగిన అనుభవంపై పోరాడేందుకు ఆయన పోలీసు స్టేషన్‌, ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. వివరాలు...  ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రాజీవ్ శుక్లా (35) యూపీఎస్సీ విద్యార్థులకు పాఠాలు, చట్టం గురించి బోధిస్తారు. ఆయన ఈ నెల ప్రారంభంలో ముంబైలో పర్యటించారు. బార్బెక్యూ నేషన్‌కు చెందిన వర్లీ అవుట్‌లెట్ నుంచి శాఖాహార భోజనాన్ని ఆర్డర్ చేశారు.


కొద్దిగా తిన్న తరువాత ఆయనకు భోజనం ఇబ్బందికరంగా ఉండడంంతో దానిని తనిఖీ చేయగా చనిపోయిన ఎలుక, బొద్దింక కనిపించాయి. ఫుడ్ పాయిజన్‌కు గురైన ఆయన ఆస్పత్రిలో చేరారు. అక్కడి నుంచి డిశ్చార్జి అయిన తరువాత దీనిపై పోలీసులు, ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. మూడు రోజుల పాటు ఆయా కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఆహార సంస్థను సంప్రదించినా సరైన స్పందన లేదని చెప్పారు.


ఆయన తనకు జరిగిన అనుభవాన్ని చెబుతూ.. ‘జనవరి 8న బార్బెక్యూ నేషన్‌ నుంచి ఆన్‌లైన్ ద్వారా శాఖాహార భోజనాన్ని ఆర్డర్ చేశాను. పప్పు రుచి తేడగా ఉండడంతో కంటైనర్‌లో చెంచాతో తనిఖీ చేశాను. లోపల చనిపోయిన ఎలుకను చూసి నేను షాక్ అయ్యాను. గులాబ్ జామూన్‌లు ఉన్న పెట్టెలో చనిపోయిన బొద్దింకలు ఉన్నాయి. దీని గురించి బార్బెక్యూ నేషన్ కస్టమర్ కేర్‌కి కాల్ చేశాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ ఆహారం తిని విపరీతమైన అనారోగ్యానికి గురయ్యాను. హోటల్ సిబ్బంది సాయంతో నాయర్ హాస్పిటల్లో చేరాను. పరీక్షలు నిర్వహించి ఫుడ్ పాయిజనింగ్‌కు చికిత్స అందించారు. జనవరి 12న డిశ్చార్జి అయ్యాను.’ 


‘నాగ్‌పడా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించినప్పటికీ ఫలించలేదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులతో మాట్లాడమని పోలీసులు చెప్పడంతో బాంద్రాలోని ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్‌కి వెళ్లాను. జరిగిన దాని గురించి వివరించాను. ఫిర్యాదు నమోదైందని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎఫ్‌డీఏ అధికారులు తెలిపారు. జనవరి 15న కూడా నాగపాడ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నాను. అయినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు’ అని శుక్లా పేర్కొన్నారు.






అలాగే రాజీవ్ శుక్లా తనకు జరిగిన అనుభవాన్ని, భోజనంలో వచ్చిన ఎలుక చిత్రం, బిల్లును సోషల్ మీడియా Xలో షేర్ చేశారు. దీనిపై బార్బెక్యూ నేషన్ స్పందిస్తూ.. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సమస్యను వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే అదంతా బూటకమని శుక్లా ఆరోపించాడు. బార్బెక్యూ నేషన్ నుంచి పంకజ్ రాయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారని, కానీ వారు ఈమెయిల్‌లకు స్పందించడం లేదని అన్నారు. తరువాత షరీక్ అని ఎవరో ఫోన్ చేసి మీటింగ్ ఫిక్స్ చేశారని, కొద్ది సేపటికి తిరిగి కాల్ చేసి మీటింగ్ రద్దు చేసినట్లు చెప్పారని శుక్లా మండిపడ్డారు.