తెలుగు తెరపై ఉత్తరాది అందాల భామల ఆధిపత్యం ఎక్కువ అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు కథానాయికలుగా రాణిస్తున్న తెలుగు అమ్మాయిలు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. శ్రీ లీల, వైష్ణవి చైతన్య, రీతూ వర్మ, అంజలి, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, ఐశ్యర్యా రాజేష్ వంటి తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా సూపర్ హిట్ సినిమాలు చేయడమే కాదు... తమకంటూ అభిమానుల్ని సొంతం చేసుకుని వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడీ జాబితాలో చేరడానికి వస్తున్న అమ్మాయి సుమయ రెడ్డి.


ఒకవైపు నటన... మరోవైపు నిర్మాణం...
మొదటి సినిమాకే రెండు బాధ్యతలు!
Sumaya Reddy First Movie: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి సుమయ రెడ్డి కథానాయికగా పరిచయం అవుతున్న సినిమా 'డియర్ ఉమ'. నటన మాత్రమే కాదు... మొదటి సినిమాతో నిర్మాణ బాధ్యతలు సైతం ఆమె చూసుకుంటున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన సుమయ రెడ్డి... ఆ బ్యానర్ మీద 'డియర్ ఉమ' ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమెకు జోడీగా 'దియ' సినిమా ఫేమ్ పృథ్వీ అంబర్ నటిస్తున్నారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, అందించడంతో పాటు డైరెక్షన్ చేస్తున్నారు.


Also Read: కనుమ రోజూ కింగ్ జోరు - మూడు రోజుల్లో 'నా సామి రంగ' కలెక్షన్స్ ఎంతంటే?



సందేశంతో కూడిన ప్రేమకథగా 'డియర్ ఉమ'
'డియర్ ఉమ' సినిమా గురించి సుమయ రెడ్డి మాట్లాడుతూ ''ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అందమైన ప్రేమకథతో పాటు చక్కని సందేశాన్ని కూడా ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తెరకెక్కించాం. టీజర్ విడుదలైన తర్వాత సినిమా గురించి అందరికీ మరింత అవగాహన వస్తుంది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది. షూటింగ్ కంప్లీట్ చేశాం. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో వాటిని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకుంటున్నాం. త్వరలో విడుదల తేదీ అనౌన్స్ చేస్తాం'' అని చెప్పారు. 


Also Readకంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా


సుమయ రెడ్డి విషయానికి వస్తే... ఆమె మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటంతో తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేశారు. మొదటి సినిమాతో తనకు మంచి పేరు, విజయం వస్తుందని ఆశిస్తున్నారు.   


సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటిస్తున్న 'డియర్ ఉమ' సినిమాలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, సీనియర్ హీరోయిన్ ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), రూప లక్ష్మీ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: సత్య గిడుతూరి, ఛాయాగ్రహణం: రాజ్ తోట, సంగీతం: రధన్, నిర్మాణ సంస్థ: సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత: సుమయ రెడ్డి, స్క్రీన్‌ ప్లే - మాటలు - దర్శకుడు: సాయి రాజేష్ మహాదేవ్.