కోలీవుడ్ స్టార్ సూర్య శివకుమార్ (Suriya Sivakumar)ను కేవలం తమిళ హీరోగా చూడలేం. ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఎంతో మంది అభిమానులున్నారు. తన నటనతో భాషలకు అతీతంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపించాలని తపనపడే హీరోల్లో సూర్య ఒకరు. ఆయన నటిస్తున్న తాజా సినిమా 'కంగువా'. సంక్రాంతి సందర్భంగా సినిమాలో హీరో సెకండ్ లుక్ విడుదల చేశారు.
పాస్ట్... ప్రజెంట్... ఫ్యూచర్...
మూడు కాలాల్లోనూ 'కంగువా'
'కంగువా' సెకండ్ లుక్ విడుదల చేయడంతో పాటు కథలో మేజర్ ట్విస్ట్ ఒకరి రివీల్ చేశారు. అది ఏమిటంటే... ఇదొక టైమ్ ట్రావెల్ సినిమా అని చెప్పారు. పాస్ట్... ప్రజెంట్... ఫ్యూచర్... భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కథ జరుగుతుందని చెప్పారు.
''కాలం కంటే విధి బలమైనది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒక్కటే పేరు వినబడుతుంది... కంగువా'' అని చిత్ర బృందం పేర్కొంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కెఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న చిత్రమిది. తెలుగులో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మాణ భాగస్వామి. తెలుగులో మాస్ మహారాజా రవితేజ 'దరువు', మ్యాచో స్టార్ గోపీచంద్ 'శౌర్యం', 'శంఖం' సినిమాలకు దర్శకత్వం వహించిన శివ ఈ చిత్రానికి దర్శకుడు.
Also Read: బాక్సాఫీస్ బరిలో కింగ్ నాగార్జున జోరు - రెండు రోజుల్లో 'నా సామి రంగ'కు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
టైమ్ ట్రావెల్ సినిమా చేయడం సూర్యకు కొత్త కాదు. 'మనం' ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన '24' టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాయే కదా! అయితే... 'కంగువా' స్పెషాలిటీ ఏమిటంటే? ఇందులో పీరియాడిక్ యాక్షన్ కూడా ఉండబోతుంది. ఆల్రెడీ విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే... సూర్య ఓ తెగకు నాయకుడి తరహా పాత్రలో కనిపించారు. ఇప్పుడీ సెకండ్ లుక్ '24'లో ఆయన గెటప్ గుర్తు చేసేలా ఉంది.
Also Read: గుంటూరు సక్సెస్‌లో గురూజీ ఎందుకు మిస్సింగ్ - మహేష్ ఇంటికి త్రివిక్రమ్ వెళ్లలేదా?
పది భాషల్లో... త్రీడీలో 'కంగువా'
'కంగువా'ను పది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఆ పది భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్రీడీలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. 'కంగువా'లో సూర్య సరసన హిందీ హీరోయిన్, తెలుగు సినిమా 'లోఫర్' ఫేమ్ దిశా పటానీ (Disha Patani) నటిస్తున్నారు. 'కంగువా' టీజర్‌ను సైతం ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. త్వరలో మరో నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.
'కంగువా' చిత్రానికి కూర్పు : నిశాద్ యూసుఫ్, పోరాటాలు : సుప్రీమ్ సుందర్, మాటలు : మదన్ కార్కే (తమిళంలో) మాటలు : ఆది నారాయణ (తెలుగులో), పాటలు : వివేక్ - మదన్ కార్కే, కాస్ట్యూమ్ డిజైనర్ : అను వర్థన్ - దష్ట పిల్లై, కాస్ట్యూమ్స్ : రాజన్, నృత్యాలు : శోభి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత :ఏజే రాజా, సహ నిర్మాత : నేహా జ్ఞానవేల్ రాజా, నిర్మాతలు : కేఈ జ్ఞానవేల్ రాజా - వంశీ - ప్రమోద్, దర్శకత్వం : శివ.