Eggless Cake Recipe : వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ చేసుకునే కేక్ రెసిపీ ఇక్కడ ఉంది. దాదాపు అన్ని కేక్‌లను గుడ్డు ఉపయోగించే చేస్తారు. కానీ ఇప్పుడు మనం తయారు చేసుకునే డేట్స్, వాల్నట్ కేక్‌ను అసలు గుడ్డే లేకుండా తయారు చేస్తాము. దీనిలో చక్కెర కూడా ఉపయోగించము. మైదా అసలు వేసే ఛాన్సే లేదు. ఇవన్నీ వేయము అంటే తయారు చేయడం చాలా కష్టం అనుకుంటున్నారేమో.. చాలా ఈజీగా ఈ టేస్టీ టేస్టీ కేక్‌ను రెడీ చేయవచ్చు. దాదాపు అన్ని కేక్‌ల కంటే దీనిని రెసిపీ చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కేక్‌ను ఎలా తయారు చేయాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఖర్జూరాలు - 25
పాలు - ఒకటిన్నర కప్పులు
గోధుమ పిండి - 1 కప్పు
వెజిటబుల్ ఆయిల్ - అరకప్పు
బేకింగ్ పౌడర్ - అర స్పూన్
బేకింగ్ సోడా - 1 స్పూన్
వాల్నట్స్ - అరకప్పు
తయారీ విధానం
మీరు కేక్ చేయాలనుకునే గంట ముందు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ముందుగా స్టౌవ్ వెలిగించి పాలను వేడి చేయాలి. అవి పొంగు వచ్చిన తర్వాత కాస్త మరగినిచ్చి స్టౌవ్ ఆపేయాలి. ఆలోపు ఖర్జూరాలను మధ్యలో కోసి గింజలు తీసేయండి. ఇలా రెడీ చేసుకున్న ఖర్జారాలను వేడిపాలల్లో వేసి గంట నానబెట్టండి. ఇలా చేయడం వల్ల డేట్స్ చాలా స్మూత్‌గా మారుతాయి. ఖర్జూరాలు గంట నానిన తర్వాత పాలతో సహా వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్‌గా చేయాలి. ఎంత మెత్తగా ఉంటే అంత మంచింది.
ఇలా తయారు చేసిన ఖర్జూరాల పేస్ట్‌ని ఓ గిన్నెలోకి తీసుకోండి. దానిలో వెజిటేబుల్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని దానిలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. పిండి బాగా కలిసిన తర్వాత ఖర్జూర మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. పిండిని ఎంత బాగా కలిపితే కేక్ అంత మంచిగా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కేక్ టిన్‌కు బదిలీ చేయండి. మీరు ఇదే కొలతలు తీసుకుంటే 6 అంగుళాల టిన్‌లోకి ఈ మిశ్రమాన్ని బదిలీ చేయాలి. బదిలి చేసే ముందు టిన్కి బటర్ పూయండి. లేదంటే బటర్ పేపర్ అడుగున వేయండి. కేక్ టాప్‌ను ముందుగానే తురుమి పెట్టుకున్న వాల్‌నట్స్‌తో గార్నిష్ చేయండి.
ఓవెన్లో 180 డిగ్రీల వద్ద సుమారు 50 నిమిషాలు దీనిని బేక్ చేయండి. కేక్ రెడీ అయిందో లేదో టూత్ పిక్‌ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. టూత్ పిక్‌ని కేక్‌లో గుచ్చితే పిండి అంటకుండా బయటకు వచ్చేస్తే కేక్ రెడీ అయినట్లు. టూత్‌పిక్‌కి కేక్ మిశ్రమం అంటుకుంటే దానిని మరికొంత సేపు బేక్ చేయాలని అర్థం. అంతే వేడివేడిగా మీ డేట్స్-వాల్నట్ కేక్ రెడీ. దీనిని పెద్దల నుంచి పిల్లలవరకు అందరూ హాయిగా తినొచ్చు. పైగా ఇది ఎగ్‌లెస్, షుగర్ లెస్, మైదా లెస్ కేక్. కాబట్టి వెజిటేరియన్స్‌కు కూడా ఈ కేక్ చాలా మంచి ఎంపిక. దీని టేస్ట్ చూస్తే మీరు లొట్టలేసుకుని తింటారు. అంత రుచికరంగా దీని రుచి ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఈ కేక్‌లో అన్ని హెల్తీ ఫుడ్స్ మాత్రమే ఉపయోగిస్తాము కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా దీనిని హాయిగా తినొచ్చు. పిల్లలకు కూడా మీరు హెల్తీగా కేక్‌ను పెట్టినవారు అవుతారు. మధుమేహులు కూడా దీనిని తినొచ్చు. కానీ కాస్త తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇంటిల్లీపాది హాయిగా లాగించగలిగే కేక్ రెసిపీ ఉన్నప్పుడు ఓ సారి ట్రై చేసి ఇంట్లో వారికి పెట్టేయండి.
Also Read : టేస్ట్ అదిరిపోయే కోడి పలావ్.. ఇంట్లో చేసుకోగలిగే రెసిపీ