పిల్లలు మారం చేస్తున్నారనో.. బద్దకించో జంక్ ఫుడ్‌ను అలవాటు చేస్తున్నారు. కానీ, అది వారి భవిష్యత్తును హరిస్తుందనే సంగతి మీకు తెలుసా? బహుశా.. ఈ విషయం తెలిసి కూడా లైట్ తీసుకుంటున్నారంటే మాత్రం.. ఇప్పటికైనా సీరియస్‌గా ఆలోచించండి. ఎందుకంటే.. మీ తప్పిదం చిన్న గుండెను చిధ్రం చేస్తుంది.
పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే.. సమతుల ఆహారాన్ని అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేని పిల్లలు చాలా చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తాయని అంటున్నారు. రక్తనాళాలు గట్టిపడడం, కుంచించుకుపోవడం వంటి తీవ్రమైన సమస్యల కారణంగా బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరుగుతుంది?
దమనులు గుండె నుంచి శుభ్రమైన రక్తాన్ని శరీర కణజాలలకు సరఫరా చేస్తాయి. ఇవి వయసు ప్రభావంతో గట్టిపడతాయి. దమనులు గట్టిపడితే రక్త ప్రసరణ సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా గుండె మీద పనిభారం పెరుగుతుంది. ఇది బీపికి కారణం అవుతుంది.
పొగతాగే అలవాటు, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, డయాబెటిస్ వంటి వంటి కారణాలతో దమనుల్లో ఈ సమస్య వేగవంతం అవుతుంది. ఇది గుండె జబ్బులకు ప్రత్యక్ష కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సమస్యలు ఇన్నాళ్లు పెద్దల్లోనే ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు పిల్లల్లో కూడా ఈ సమస్యలు వస్తున్నాయి.
అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
10 నుంచి 13 సంవత్సరాల మధ్యవయసులో ఉన్న 4500 మంది పిల్లల ఆహారపు అలవాట్లను అధ్యయనం చేశారు. వారు 17 -24 మధ్య వయసుకు చేరిన తర్వాత దమనుల పనితీరును పరిశీలించారు. ఈ అధ్యయనం అవాక్కయ్యే విషయాలను వెలువరించింది.
ఎక్కువ చక్కెరలు, తక్కువ ఫైబర్, ఎక్కువ కొవ్వులు కలిగిన ఆహారం తీసుకున్న పిల్లల్లో 17 సంవత్సరాల వయసులోనే సమతుల ఆహారం తీసుకునే పిల్లల దమనులతో పోలిస్తే వీరి దమనులు గట్టి పడడం మొదలైనట్టు తెలుసుకున్నారట.
చిన్నవయసులో గుండె జబ్బులా?
ప్రస్తుతం ప్రతి 11 మంది పిల్లల్లో ఒకరు స్కూలుకు వెళ్లే వయసు నాటికే ఊబకాయంతో ఉన్నారట. అంటే ఆరేళ్ల వయసు నాటికి మూడవ వంతు పిల్లలు అధిక బరువుతో బాధపడుతున్నారు. చిన్న వయసు నుంచే దమనులు గట్టి పడడం మొదలైతే.. వారు యవ్వనంలో ఉండగానే గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది.
సమతుల ఆహారమే రక్ష
పిల్లలు తీసుకునే ఆహారంలో పోషకాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో తప్పక గమనించాలి. పోషకాలు లేని జంక్ ఫూడ్ పిల్లలకు ఇవ్వక పోవడమే మంచిది. ఎక్కువ కూరగాయలు, పండ్లు పిల్లలకు ఇవ్వడం అవసరం. ఇవి శరీరం ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమయ్యే యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. కండర పుష్టికి, ఎముకల బలానికి ప్రొటీన్ అవసరమవుతుంది. ప్రొటీన్ కలిగిన ఆహారం ఇవ్వడంతో పాటు తగినంత శారీరక శ్రమ ఉండేలా జాగ్రత్త పడాలి. ఈరోజుల్లో పిల్లలు ఆట స్థలాలను వాడడం చాలా తగ్గింది. శ్రమ తగినంత లేకపోయినా సమతుల ఆహారం తీసుకున్నప్పటికీ కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. కనుక తప్పని సరిగా పిల్లలకు తగినంత శారీరక శ్రమ ఉండేలా చూడడం అవసరం. ఏ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతక వ్యాధులు పొంచి ఉంటాయనే సంగతి మరచిపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : కరకరలాడే పెసర పునుగులు.. తయారు చేయడం ఇంత తేలికా అనిపించే రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.